దులీప్ ట్రోఫీ ఫైనల్‌‌లో ఇషాన్‌‌ సెంచరీ.. చేతులెత్తేసిన సౌత్ జోన్ బౌలర్లు.. తేలిపోయిన సిరాజ్

దులీప్ ట్రోఫీ ఫైనల్‌‌లో ఇషాన్‌‌ సెంచరీ.. చేతులెత్తేసిన సౌత్ జోన్ బౌలర్లు.. తేలిపోయిన సిరాజ్
  • బ్యాటింగ్‌‌లో మెరిసిన శిఖర్ మోహన్, ఈశ్వరన్, కుశాగ్ర, వైభవ్ సూర్యవంశీ 
  • చేతులెత్తేసిన సౌత్ జోన్ బౌలర్లు.. తేలిపోయిన సిరాజ్ 
  • తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసిన ఈస్ట్ జోన్

చెన్నై: దులీప్‌‌ ట్రోఫీ ఫైనల్‌‌ పోరులో ఈస్ట్ జోన్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (111 పరుగులు, 135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌‌) నాటౌట్‌‌గా నిలిచాడు. అలాగే, అభిమన్యు ఈశ్వరన్ (72, 86 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్), శిఖర్ మోహన్ (85, 120 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్స్‌‌లు), కుమార్ కుశాగ్ర (63, 75 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌‌లు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.

వీరికి తోడు వైభవ్ సూర్యవంశీ (44, 37 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌) మెరుపులు తోడవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ 4 వికెట్ల నష్టానికి 385 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఏ మాత్రం ప్రభావం చూపలేక భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

సూర్యవంశీ మెరుపులు.. ఈశ్వరన్ జోరు..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌‌కు దిగిన ఈస్ట్ జోన్‌‌కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్, వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. వైభవ్ క్రీజులో ఉన్నంతసేపూ చెలరేగి ఆడాడు. ముఖ్యంగా సిరాజ్ వేసిన ఓ ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు.

వీరిద్దరూ సౌత్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా కేవలం 14 ఓవర్లలోనే తొలి వికెట్‌‌కు 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే మిలింద్ వేసిన షార్ట్ పిచ్ బంతికి పుల్ షాట్ ఆడి సూర్యవంశీ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఈశ్వరన్ (72) కూడా ఔటయ్యాడు. అనంతరం వచ్చిన సుదీప్ ఘరామీ (1) కూడా ఎక్కువసేపు నిలవకపోవడంతో ఈస్ట్ జోన్‌‌ 147 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయి కాస్త తడబడింది.

తేలిపోయిన సిరాజ్.. 
సౌత్ జోన్ బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలమైంది. ప్రధాన పేసర్ మహమ్మద్ సిరాజ్ 14 ఓవర్లు వేసి ఏకంగా 96 పరుగులు సమర్పించుకున్నాడు. వికెట్ ఏమీ తీయకపోగా ఓవర్‌‌కు 6.85 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ రెండు వికెట్లు పడగొట్టినా పరుగుల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయాడు.

చేపాక్‌‌లో ‘వైభవ్’ క్రేజ్!
దేశవాళీ మ్యాచ్‌‌ల్లో ప్రేక్షకులను వెతుక్కోవాల్సిన పరిస్థితుల్లో చెన్నైలోని ఎంఏ చిదంబరం (చేపాక్) స్టేడియం ఆదివారం కిక్కిరిసిపోయింది. ఐపీఎల్ 2026 ప్రదర్శనతో దేశవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ ఆటను చూసేందుకు దాదాపు 12 వేల మంది అభిమానులు మైదానానికి తరలివచ్చారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌‌సీఏ) సీ, డీ, ఈ స్టాండ్స్‌‌లోకి ఉచిత ప్రవేశం కల్పించగా.. ఫ్యాన్స్ ఉదయం నుంచే బారులు తీరారు.

గతంలో సచిన్ టెండూల్కర్ 2013లో తన చివరి రంజీ మ్యాచ్ ఆడినప్పుడు, 2025 జనవరిలో విరాట్ కోహ్లీ ఢిల్లీ తరఫున ఆడినప్పుడు మాత్రమే దేశవాళీ పోరుకు ఈ స్థాయి క్రేజ్ కనిపించింది. ఆట ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు మైదానం వీడకుండా ‘వైభవ్ భాయ్, వైభవ్’ అంటూ నినదించడంతో, ఈ బిహార్ కుర్రాడు ఫెన్స్ వద్దకు వచ్చి అభిమానులకు అభివాదం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్‌‌లో ఎంతో ఒదిగి ఉండే వైభవ్‌‌కు కేవలం ఆటపై మాత్రమే శ్రద్ధ ఉందని అతని సహచర ఆటగాడు శిఖర్ మోహన్ పేర్కొన్నాడు.

స్కోర్‌‌‌‌: ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 385/4 (ఇషాన్ కిషన్ 111 బ్యాటింగ్, శిఖర్ మోహన్ 85, ఈశ్వరన్ 72, కుమార్ కుశాగ్ర 63 బ్యాటింగ్, వైభవ్ సూర్యవంశీ 44,  సుదీప్ ఘరామీ 1 ).
 
ఆదుకున్న కిషన్, శిఖర్ జోడీ..
ఈ దశలో కెప్టెన్ ఇషాన్ కిషన్, యువ బ్యాటర్ శిఖర్ మోహన్ క్రీజులో పాతుకుపోయారు. ఆచితూచి ఆడుతూనే లూజ్ బాల్స్‌‌ను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌‌లో 4,000 పరుగుల మైలురాయిని దాటిన కిషన్.. 71 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శిఖర్ మోహన్ (85) కూడా పరిణతితో బ్యాటింగ్ చేస్తూ త్రిపురన విజయ్ బౌలింగ్‌‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో అలరించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌‌కు 94 పరుగులు జోడించారు. శతకానికి చేరువవుతున్న క్రమంలో శిఖర్ మోహన్‌‌ను మిలింద్ బౌల్డ్ చేశాడు.

శిఖర్ ఔటైనా కిషన్ జోరు తగ్గలేదు. మరో ఎండ్‌‌లో కుమార్ కుశాగ్ర (63 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. శ్రేయస్ గోపాల్ బౌలింగ్‌‌లో బౌండరీ బాది కిషన్ తన 10వ ఫస్ట్ క్లాస్ సెంచరీని అందుకున్నాడు. తర్వాత కుశాగ్ర కూడా వేగంగా ఆడుతూ అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరూ వికెట్ పడకుండా ఐదో వికెట్‌‌కు 144 పరుగులు జోడించారు. దీంతో మొదటి రోజు పూర్తిగా ఈస్ట్ జోన్ ఆధిపత్యం నడిచింది.