తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం రోజునే గందరగోళం నెలకొంది. సోమవారం ( సెప్టెంబర్ 7 ) అసెంబ్లీ లోపల బీజేపీ ఎమ్మెల్యేల నిరసన, అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నిరసనలతో గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి సమావేశాలు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుకుంటారని... కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా పాదయాత్ర చేస్తానని అంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పుల రాష్ట్రము ఇబ్బందులు ఎదుర్కొంటోందని.. నీళ్ల సమస్యకు ఎల్ నినో , కేసీఆర్ రెండు కారణాలని అన్నారు. కేసీఆర్ ఇరిగేషన్ శాఖను పూర్తిగా నాశనం చేశారని.. నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ పనితీరు సున్నా అని అన్నారు ఉత్తమ్.
కాళేశ్వరం నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు చేశారని.. ప్రాజెక్ట్ సరిగా నిర్మించి ఉంటే ప్రస్తుతం ఉన్న సమస్యలు వచ్చేవి కాదని అన్నారు.తుమ్మిడిహెట్టి నుంచి నీటిని తరలించే విషయంలో మార్పులు చేయడం ఘోర తప్పిదమని అన్నారు. ఆ మార్పులు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే.. ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేదని అన్నారు ఉత్తమ్.
