హైదరాబాద్ లోని బౌరంపేట్ లో ఘోరం జరిగింది. మంటల్లో కారు పూర్తిగా దగ్దమవ్వగా అందులో నుంచి బయటికి రాలేకపోయిన వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. సోమవారం ( సెప్టెంబర్ 7 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేట్ లోని వజ్ర బిల్డర్స్ వెనక ఉన్న పిసరి వారి పొలం దగ్గర జరిగింది ఈ ఘటన.
కారులో ఒక్కసారిగా మంటలు అంటుకొని కొద్దిసేపటికే పూర్తిగా దగ్దమైంది కారు. దీంతో కారులో ఉన్న వ్యక్తి బయటికి రాలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీం తో ఆధారాలు సేకరించారు.
మృతుడు బౌరంపేట్ ప్రణీత్ ప్రణవ్ మేడోస్ లో నివాసముండే కార్తీక్ రాధాకృష్ణగా గుర్తించారు పోలీసులు. కారులో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందా? లేక వేరే ఏదైనా కోణం ఉందా? అనే దిశగా విచారణ వేగవంతం చేశారు పోలీసులు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
