అసెంబ్లీ ఎదుట హైటెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి

అసెంబ్లీ ఎదుట హైటెన్షన్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు మొదలైన తొలి రోజే అసెంబ్లీ ఎదుట నానా రచ్చ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లు నెట్టుకొని లోపలికి వెళ్లడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాట సమయంలో నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కంటతడి పెట్టుకున్నారు. పోలీసులు మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన 27 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలా జరగలేదని వాపోయారు.

మహిళలు అని కూడా చూడకుండా నెట్టేస్తున్నారని సునీత లక్ష్మారెడ్డి కలత చెందారు. బీఆర్ఎస్ నేతలు నల్ల దుస్తులు ధరించడంతో లోపలికి ఎంట్రీ లేదని అసెంబ్లీ సెక్యూరిటీ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. పోలీసులతో జరిగిన వాగ్వాదంలో, తోపులాటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గాయపడ్డారు.

అసెంబ్లీ ఎదుట రసాభాసపై.. డీసీపీ శిల్పవల్లి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు బ్లాక్ టీ షర్ట్స్ ధరించి.. స్లోగన్స్ చేస్తూ వచ్చారని, వాళ్ల టీ షర్ట్స్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్లోగన్స్ రాశారని.. అందుకే వాళ్ళని లోపలికి అనుమతించలేదని స్పష్టం చేశారు. నల్ల దుస్తులు ధరించి రావడంలో తప్పులేదని, నిరసన వ్యక్తం చేయడం కూడా తప్పు కాదని.. కానీ బ్లాక్ టీషర్ట్స్ పైన స్లోగన్స్ రాసుకొని రావటమే తప్పు అని ఆమె వివరించారు.

అసెంబ్లీ ఎదుట టీ షర్ట్స్ తీసేసి బనియన్స్తో లోపలికి వెళ్తామన్నారని.. దానికి తాము అంగీకరించలేదని ఆమె చెప్పారు. బీఆర్ఎస్ నేతల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారనేది అవాస్తవమని, ఎవరి పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించలేదని డీసీపీ తెలిపారు. బీఆర్ఎస్ నేతలను కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించామని.. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించాలని చెబుతున్నారని.. అది అబద్ధం అని డీసీపీ శిల్పవల్లి చెప్పారు.