- క్యాంపస్‌లోని నివాసానికి ఆహ్వానించి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో (జేఎన్‌యూ) తీవ్ర దుమారం రేగింది. ఓ ప్రొఫెసర్ తమను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ పది మందికిపైగా విద్యార్థులు నెల రోజుల క్రితం వర్సిటీ యంత్రాగానికి ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై వర్సిటీలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ) ప్రస్తుతం దర్యాప్తు జరుపుతోంది.
ఆ ప్రొఫెసర్ క్యాంపస్‌లోని తన నివాసానికి సమావేశాలు, విందులకు ఆహ్వానించేవారనీ, అక్కడ అసభ్యకరంగా ప్రవర్తించేవారనీ స్టూడెంట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా, తరగతి గదుల్లోనూ తమతో అనుచిత వ్యాఖ్యలు చేసేవారని ఆరోపించారు. వైవా పరీక్షల సమయంలో కొందరికి అసభ్యకరమైన రీతిలో ప్రతిపాదనలు తెచ్చినట్టు విద్యార్థులు వెల్లడించారు. తొలి ఫిర్యాదు నమోదైన తర్వాత, పలువురు సీనియర్ విద్యార్థులు బాధితులకు సంఘీభావంగా ముందుకు వచ్చారు.
సదరు ప్రొఫెసర్ గతంలోనూ తమతో ఇలాగే అసభ్యంగా ప్రవర్తించారంటూ పలువురు స్టూడెంట్లు ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఐసీసీ విచారణ జరుపుతోంది. అయితే, దీనిపై జేఎన్‌యూ యంత్రాంగం గానీ, వైస్-చాన్సలర్ కార్యాలయం గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. విద్యార్థి సంఘాలు కూడా ఈ వ్యవహారంపై ఇంకా స్పందించాల్సి ఉంది. విచారణ పూర్తయిన తర్వాతే ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
