- 11వ రోజు కొనసాగిన సహాయక చర్యలు
- సవాలుగా మారిన మృతదేహాల గుర్తింపు
ఖాట్మాండు: నేపాల్ జల విపత్తు కారణంగా మృత్యువాతపడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం వివిధ ప్రాంతాల్లో మరికొన్ని డెడ్ బాడీలను వెలికితీయగా.. మృతుల సంఖ్య 1,344కు పెరిగిందని అధికారులు ప్రకటించారు. ఇంకా 5 వేల మంది ఆచూకీ తెలియట్లేదని తెలిపారు. ఇప్పటివరకూ 13,100 మందిని రక్షించారు. అలాగే, చైనా వైపు 31 మంది మరణించారు.
టిబెట్‌లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. విపత్తు సంభవించి11 రోజులు కాగా, గల్లైంతైనవారి కోసం సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఒకవైపు కూలిన ఇండ్లు, శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీయడం కష్టసాధ్యం కాగా.. మరోవైపు వెలికితీసిన మృతదేహాలను గుర్తించడం మరో సవాలుగా మారింది. ఆగస్టు 26న నేపాల్-–టిబెట్ సరిహద్దు సమీపంలో సంభవించిన ఐస్-రాక్ హిమపాతం కారణంగా ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
ఆకస్మిక వరదలు భోటెకోషి నది గుండా దిగువకు భారీ ప్రవాహాన్ని, శిథిలాలను తీసుకువచ్చి ఉత్తర, మధ్య నేపాల్‌లోని నివాస ప్రాంతాలను జలసమాధి చేశాయి. ఇళ్లు, వాహనాలు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. నేపాల్‌లో మృతిచెందినవారిలో 85 మంది పిల్లలు ఉన్నారు. దాదాపు 500 మృతదేహాలు శరీర భాగాలు తెగిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. అనేక మృతదేహాలు గుర్తించేందుకు వీలులేకుండా దొరికాయి. వరదల్లో దొరికిన గుర్తుతెలియని మృతదేహాలు, మానవ అవశేషాలను గుర్తించడం కోసం వాటి డీఎన్ఏ శాంపిల్స్‌ను సేకరిస్తున్నారు.
అలాగే గల్లంతైన వారి బంధువుల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరిస్తున్నారు. ఇప్పటివరకూ డీఎన్‌ఏ శాంపిల్స్ సేకరించిన తర్వాత 1,000కి పైగా గుర్తుతెలియని మృతదేహాలను ఖననం చేశామని అధికారులు తెలిపారు.
