- అందుకోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి
- ఉపాధ్యాయులే సమాజ నిర్మాణానికి వెన్నెముక
- విద్యార్థుల భవిష్యత్‌నూ తీర్చిదిద్దేది వారేనని వ్యాఖ్య
- పలువురు ఉపాధ్యాయులకు భారత్ గురురత్న అవార్డుల ప్రదానం
రవీంద్రభారతి, ఇబ్రహీంపట్నం, వెలుగు: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు వెన్నెముకలా పనిచేస్తున్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థుల భవిష్యత్, సంస్కృతి, ప్రవర్తనను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భారత్ గురురత్న అవార్డ్స్’కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు.
ఉపాధ్యాయుల సేవలను గుర్తించి, వారిని ప్రోత్సహిస్తూ సత్కరించడం అభినందనీయమన్నారు. వెనుకబడిన విద్యార్థులను సైతం ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. టీచర్స్ డే వంటి ప్రత్యేక సందర్భాల్లో ఉపాధ్యాయులను గౌరవించి, వారి సేవలను గుర్తించడం ద్వారా విద్యారంగంలో మరింత స్ఫూర్తి కలుగుతుందని చెప్పారు. పుస్తకం లేని బాల్యం ఉండకూడదు అనే ఆలోచనతో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు చట్టాల అమలుతో పాటు ప్రజల్లో సామాజిక అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి చిన్నారికి విద్య అందేలా సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, టీవీలు విద్యార్థుల చదువుకు ఆటంకాలుగా మారుతున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ డిస్ట్రాక్షన్స్‌ను అధిగమించి విద్యార్థులకు బలమైన విద్యా పునాది వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలను గౌరవించి క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. తన జీవితంలో సాధించిన విజయాలకు పాఠశాల రోజుల్లో ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, పట్టుదలే ప్రధాన కారణమని గుర్తుచేశారు.
డాక్టర్‌గా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా ఎదగడంలో ఉపాధ్యాయుల బోధన, మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు. జీవితంలో విజయాన్ని సాధించాలంటే విద్యార్థులు క్రమశిక్షణతో పాటు నిరంతర పట్టుదలతో కృషి చేయాలని సూచించారు.
అనంతరం వివిధ ప్రాంతాల నుంచి ఎంపికైన ఉపాధ్యాయులకు మంత్రి వివేక్ వెంకటస్వామి ‘భారత్ గురు రత్న’అవార్డులను ప్రదానం చేసి, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో శారద ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యారంగ ప్రముఖులు పాల్గొన్నారు.
అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి: వివేక్
అణచివేత జరిగిన చోట అంబేద్కర్ ఉండేవారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తారామతిపేట్‌లో సైబర్ మెడోస్ వెంచర్‌లో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమానికి మంత్రి వివేక్ వెంకటస్వామి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తధితరులు హాజరయ్యారు. అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్న అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులకు మంత్రి వివేక్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో మందికి ఉపయోగకరమని పేర్కొన్నారు.
సాంస్కృతిక కేంద్రాలు భవిష్యత్ తరాలకు అంబేద్కర్ ఆశయాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి ఏం కావాలన్నా తన వంతు సహాయ సహకారాలను అందిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సాంస్కృతిక కేంద్రాలు ఎంతో అవసరమని, అవి భవిష్యత్ తరాలకు అంబేద్కర్ ఆశయాలను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెప్పారు.
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈ కేంద్రాలు అభ్యుదయ భావాల వ్యాప్తికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయాలు, సామాజిక సమానత్వం, విద్య, కళలు, సాంస్కృతిక విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
