దుబాయ్: విమెన్స్ ఆసియా కప్‌లో ఇండియా ఓపెనర్ షెఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత అనుచితంగా ప్రవర్తించిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాపై ఐసీసీ జరిమానా విధించింది. ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కేటాయించింది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇండియా ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో షెఫాలీ పెవిలియన్‌కు వెళ్తున్న టైమ్‌లో ఫాతిమా వివాదాస్పద రీతిలో సంజ్ఞలు చేసింది.
ప్లేయర్ల ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–1లోని ఆర్టికల్ 2.5 నిబంధనను ఫాతిమా ఉల్లంఘించినట్లు ఐసీసీ తేల్చింది. గత 24 నెలల కాలంలో ఫాతిమాకు ఇది రెండో తప్పు కావడంతో ఆమె ఖాతాలో మొత్తం రెండు డీమెరిట్ పాయింట్లు చేరాయి. ఐసీసీ మ్యాచ్ రిఫరీ సుప్రియా రాణిదాస్ ప్రతిపాదించిన శిక్షను ఫాతిమా అంగీకరించడంతో అధికారిక విచారణ రద్దయింది. ఆన్-ఫీల్డ్ అంపైర్లు నిమాలి పెరారా, షాతిరా జాకిర్ జెసీ, మూడో అంపైర్ రొకేయా సుల్తానా, నాలుగో అంపైర్ రబాబ్ అహ్సన్ ఈ అభియోగాన్ని మోపారు.
