హైదరాబాద్, వెలుగు : సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ‘మారుపేర్ల’ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ సిఫార్సుల ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. సోమవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. 1997 నుంచి కొనసాగుతున్న ఈ సమస్యలో అధికారిక రికార్డుల్లో ఒకరి పేరు ఉండగా.. వారి స్థానంలో మరొకరు విధులు నిర్వహిస్తున్న సందర్భాలు ఉన్నాయన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఈ విధానం కొనసాగడంతో గతంలో 45 మంది అధికారులతో పాటు సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సింగరేణిలో ప్రస్తుతం దాదాపు 90 వేల మంది ఉద్యోగులు ఉండగా.. మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న వారు కేవలం 128 మంది మాత్రమేనని భట్టి విక్రమార్క వెల్లడించారు. చట్టపరమైన చిక్కులు ఉండడంతో అధికారులు నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతున్నారన్నారు. ఎన్నో ఏండ్లుగా ఉద్యోగాలు చేస్తున్న 128 మంది పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఏ ఒక్క అధికారిపైనా బాధ్యత పడకుండా కమిటీ ద్వారా సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కమిటీ నివేదిక అందిన అనంతరం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.
పురాతన ఆలయాల సంరక్షణకు కట్టుబడి ఉన్నాం
జగిత్యాల/ధర్మపురి, వెలుగు : రాష్ట్రంలోని పురాతన ఆలయాలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు సోమవారం తెల్లవారుజామున మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి భూమిపూజ చేశారు. అంతకుముందు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.
బాసర నుంచి భద్రాచలం వరకు ప్రముఖ ఆలయాల అభివృద్ధితో పాటు పుష్కరాలకు వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పుష్కరాల పనుల కోసం బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. పుష్కరాల నాటికి ఉగ్ర నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం తిమ్మాపూర్‌లో సబ్‌స్టేషన్, ధర్మపురి వద్ద గోదావరిలో పుష్కర ఘాట్ల నిర్మాణానికి, కోటిలింగాలలో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు.
