చెన్నై: రాజకీయాల ముసుగులో మహిళలపై వ్యక్తిగత దూషణలు, ద్వంద్వార్థ సంభాషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ డీఎంకేను హెచ్చరించారు. సోమవారం శాసనసభలో హోంశాఖ పద్దులపై జరిగిన చర్చ ముగింపు సందర్భంగా ఆయన ప్రసంగించారు. గతంలో మాజీ సీఎం జయలలిత, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను పరోక్షంగా, ప్రత్యక్షంగా ప్రస్తావిస్తూ సభా మర్యాదలు, రాజకీయ విలువలపై విజయ్ గళమెత్తారు.
1989లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ వేదికగా జయలలితపై జరిగిన దాడి, అవమానాలను గుర్తుచేశారు. ఆనాటి దుర్ఘటనలు శాసనసభ చరిత్రలోనే మాయని మచ్చని, గతంలో జరిగాయనే సాకుతో అలాంటి విషపూరిత ప్రవర్తనను పునరావృతం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇటీవల నటి త్రిషను లక్ష్యంగా చేసుకొని డీఎంకే వర్గాలు చేసిన ద్వంద్వార్థ వ్యాఖ్యలు, వ్యక్తిగత దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడులో ఇటీవల కాలంలో అసభ్యత, ద్వేషం వరదలా పారుతోందని, ప్రజా జీవితంలో ఉన్న మహిళలపై ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం క్షమించరాని నేరమని వ్యాఖ్యానించారు.
మహిళల గౌరవమే ప్రభుత్వ అజెండా
మహిళలను గౌరవించడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని విజయ్ తెలిపారు. ‘‘నా రాజకీయ విజయానికి ప్రధాన కారణం మహిళలే. అలాంటి మహిళలపై అగౌరవకరమైన భాష ఉపయోగిస్తే నా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ప్రజాస్వామ్యంలో తీవ్రమైన రాజకీయ విమర్శలనూ స్వాగతిస్తాం.. కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు’’ అని విజయ్ స్పష్టం చేశారు. కేవలం రోడ్లు, కర్మాగారాలు నిర్మిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు కాదని, పౌరులు రోజువారీ జీవితంలో అనుభవించే భద్రత, స్వేచ్ఛే అసలైన ప్రగతికి కొలమానమని విజయ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్
డీఎంకే ‘మిస్టర్ క్లీన్’ ఇమేజ్ వెనుక వ్యవస్థీకృత అవినీతి దాగుందని సీఎం విజయ్ ఫైర్ అయ్యారు. పురపాలక, తాగునీటి సరఫరా ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల నుంచి 7.5 నుంచి 10 శాతం వరకు కమీషన్లను ఈఎంఐల రూపంలో ‘పార్టీ ఫండ్స్’ పేరిట మాజీ సీఎం ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ వసూలు చేశారని ఈడీ నివేదికలను ఉటంకిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
బ్యాంకు రుణాలకు ఈఎంఐలు కట్టినట్టుగా వాయిదాల పద్ధతిలో ప్రభుత్వ కాంట్రాక్టర్లు ఆ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చిందని విమర్శలు చేశారు. అవినీతి గురించి మాట్లాడితే ఆధారాలు అడుగుతారు తప్ప ‘మేం అవినీతి చేయలేదు’ అని డీఎంకే ఎప్పుడూ చెప్పలేదని ఆయన ఎద్దేవా చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. డీఎంకే సభ్యులతో మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించకపోవడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.
