కాజీపేట, వెలుగు: పండుగలు, జాతరలు, ఊరేగింపుల సందర్భంగా భారీగా జన సమూహాలు ఉన్నప్పుడు వ్యవహరించాల్సిన తీరుపై వరంగల్ సీపీ ఎన్.శ్వేత పోలీస్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. మడికొండలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న శిక్షణ తరగతులను సోమవారం ఆమె ప్రారంభించారు.
ఇందులో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు సహా 43 మంది ట్రైనింగ్ ఆఫీసర్లు పాల్గొనగా, వారికి ప్రాక్టీకల్‌గా అన్ని విషయాలు వివరించారు.
ట్రైనింగ్ తర్వాత ఆఫీసర్లు వారివారి జిల్లాల పోలీస్ యూనిట్లలోని ఆఫీసర్లు, సిబ్బందికి ఇదే తరహాలో శిక్షణ అందించనున్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ప్రభాకర్ రావు, శ్రీనివాస్, పీటీసీ ఏసీపీ రమణబాబు, ఆర్ఐ సింహచలం శ్రీనివాస్, సీఐ సూర్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
