జన్వాడలో 60 ఎకరాల అక్రమ లే అవుట్ కూల్చివేత

జన్వాడలో 60 ఎకరాల అక్రమ లే అవుట్ కూల్చివేత

నార్సింగి సర్కిల్ పరిధిలోని జన్వాడ గ్రామంలో అక్రమ లే అవుట్‌పై అధికారులు కొరడా ఝళిపించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన లే అవుట్‌పై నార్సింగి పట్టణ ప్రణాళిక అధికారులు, హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు.

దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ అక్రమ లే అవుట్‌లో బేస్‌మెంట్ స్థాయి వరకు నిర్మించిన పలు నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న ప్రాంతాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ నిర్మాణాలను గుర్తించారు.అనంతరం సంబంధిత అధికారుల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలు చేపట్టారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా, నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు ప్రారంభించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, అనధికారిక లే అవుట్లు, నిర్మాణాలను ప్రోత్సహించవద్దని అధికారులు సూచించారు.