అమాయకుల నమ్మకమే నందన పెట్టుబడి.. 'నందూస్ వరల్డ్' దంపతుల స్కామ్ లెక్కలివే!

అమాయకుల నమ్మకమే నందన పెట్టుబడి.. 'నందూస్ వరల్డ్' దంపతుల స్కామ్ లెక్కలివే!

లండన్ లో విలాసవంతమైన జీవితాన్ని చూపిస్తూ.. లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న  'నందూస్ వరల్డ్' దంపతులు చిక్కుల్లో పడ్డారు.  యూకే వీసాలు, స్పాన్సర్‌షిప్‌ల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మిచి కోట్లలో ముంచిన వ్యవహారంలో పోలీసులకు చిక్కారు. లేటెస్ట్ గా శంషాబాద్ విమానాశ్రయం (RGIA)లో దిగగానే నందు అలియాస్ రమా నందనను అరెస్ట్ చేశారు. లుకౌట్ నోటీసుల ఆధారంగా ఇమిగ్రేషన్ అధికారులు ఈ చర్యలు చేపట్టారు.  దీంతో ఈ దంపతుల మోసాల చిట్టా మరోసారి చర్చనీయాశమైంది.

మోసాల చిట్టా..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు గుజరాత్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులు, యూకేలో వీసా గడువు పొడిగించుకోవాలనుకునే వారిని ఈ జంట లక్ష్యంగా చేసుకుంది. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, లండన్ లలో 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరుతో ఆఫీసులు ప్రారంభించారు. యూకేలో వర్క్ వీసాలు, అధిక వేతనాల ఉద్యోగాలు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (CoS) ఇప్పిస్తామని నమ్మబలికారు. ఒక్కో బాధితుడి నుంచి  రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

కోట్లలో స్కామ్?

యూకేలో క్లౌడ్‌సర్వ్, ఆర్‌ఆర్‌జే టెక్ వంటి దాదాపు 8కి పైగా షెల్ కంపెనీలను క్రియేట్ చేశారు ఈ  'నందూస్ వరల్డ్' దంపతులు. వాటి పేరుతో నకిలీ ఆఫర్ లెటర్లు పంపి మోసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు ఇచ్చిన తర్వాత బాధితులను బ్లాక్ చేయడం, ప్రశ్నించిన వారిని బెదిరించడం చేశారని వాపోతున్నారు. ఇలా బాధితుల సంఖ్య 50 నుంచి 100 దాకా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ దంపతులు చేసిన మొత్తం మోసం విలువ రూ. 10 నుంచి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ALSO READ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్ నందు అరెస్ట్!

పోలీస్ కేస్..అరెస్ట్ ..

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన శివ క్రాంతి కుమార్ ఫిర్యాదుతో మధుకర్ (A1), రమా నందన (A2), మోహన్ రావు (A3) లపై కేసు నమోదైంది. దీంతో ఈ దంపతుల చిట్టా ఒక్కొక్కటి బయటకు వచ్చాయి. వివిధ జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కపుల్స్ పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరుకాకపోవడంతో చివరికి పోలీసులు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ క్రమంలోనే లండన్ నుంచి వచ్చిన నందనను  శంషాబాద్ ఎయిర్‌పోర్టులో  పోలీసులు అరెస్ట్ చేశారు. విసా స్కామ్ పై తదుపరి విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు.

మరోవైపు నందన ఈ ఆరోపణలను ఖండిస్తూ, కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఆడియోలు ఎడిట్ చేసినవని గతంలో నందు ఫైర్ అయింది. ఏది ఏమైనా, యూట్యూబ్‌లో రోల్ మోడల్‌గా కనిపించిన జంట.. ఇప్పుడు కోట్లాది రూపాయల వీసా కుంభకోణంలో అరెస్ట్ కావడం తెలుగు రాష్ట్రాలతో పాటు , ఎన్ఆర్ఐలలో తీవ్ర కలకలం రేపుతోంది.