స్టార్ హీరోయిన్ సమంతకు కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక నిలయం ఈషా యోగా సెంటర్ ప్రత్యేకమైన ప్రదేశం. తన జీవితంలో గొప్ప మార్పుకు దారితీసింది ఇక్కడే. మానసికంగా, ఆరోగ్య పరంగా తనకు ఎంతో ఊరటనిచ్చిందని ప్రదేశం ఇదే అని ఆమె నమ్ముతారు. అంతే కాదు ఈ సెంటర్ లోనే ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో ప్రముఖ సినీ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె 2025లో అత్యంత వేదోక్తంగా.. యోగిక్ పద్ధతిలో వివాహమాడారు. 'ది ఫ్యామిలీ మ్యాన 2', 'సిటాడెల్ : హనీ బన్నీ' ప్రాజెక్టులతో మొదలైన వీరి పరిచయం.. ఆ తర్వాత ప్రేమగా మారి వివాహబంధానికి దారితీసింది.
ఆధ్యాత్మిక పయనం...
ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉన్న సమంత లేటెస్ట్ గా మరోసారి 'ఈషా యోగా' సెంటర్ ను సందర్శించారు. గత ఐదేళ్లుగా తన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ప్రశాంతమైన ప్రాంగణంలో గడిపిన క్షణాలను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. అక్కడ ఆవు దూడలతో సమయం గడపడం, సాత్విక ఆహారాన్ని ఆస్వాదించడం, లింగ భైరవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం వంటి దృశ్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఈషా వ్యవస్థాపకులు సద్గురుతో కలిసి దిగిన ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు.
నన్ను నేను కొత్తగా...
తన ఆధ్యాత్మిక పయనాన్ని గుర్తుచేసుకుంటూ సమంత ఒక భావోద్వేగ నోట్ రాశారు. మన బలాలు, పరిమితులు, సరిహద్దుల గురించి మనకు పూర్తి అవగాహన వచ్చిందని భావించే ఒక దశకు చేరుకుంటాం. కానీ, గత ఐదేళ్లు నాకు అంతకుమించి నేర్పాయి అని పేర్కొన్నారు. ప్రతిసారీ ఈ కేంద్రానికి వచ్చినప్పుడు తనలో నూతన ఉత్సాహం, అన్వేషించాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయనే జ్ఞానం కలుగుతాయని ఆమె తెలిపారు. నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఈ ప్రదేశం నాలో ఇంధనంలా పనిచేస్తుంది. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకునేలా చేసే మనుషులను, ప్రదేశాలను వెతుక్కోండి అని అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇక సమంత జూన్‌లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ విజయోత్సవ వేదికపై సమంత తన ప్రెగ్నెన్సీ వార్తను అధికారికంగా ఖరారు చేసి అభిమానుల్లో ఆనందం నింపారు. ప్రస్తుతం ప్రసూతి విరామంలో ఉన్న సమంత, మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు అడుగులు వేస్తూ.. సరికొత్త శక్తితో ముందుకు సాగుతున్నారు. తన ఆధ్యాత్మిక పయనాన్ని గుర్తుచేసుకుంటూ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.
