- ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 4.56 లక్షల యూనిట్ల అమ్మకం
- పెద్ద ఎస్‌యూవీలలో డీజిల్ వేరియంట్‌కే పెద్ద పీట
న్యూఢిల్లీ: డీజిల్ కార్లకు బై బై చెప్పేశాం అనుకున్నాం. కానీ, వీటి అమ్మకాలు అనుహ్యంగా పుంజుకున్నాయి. ఎక్కువ పొగ, శబ్దం, పర్యావరణానికి అంతగా మంచిది కాకపోవడంతో డీజిల్ బండ్లకు డిమాండ్ పడిపోగా, ఈ–20 దెబ్బకు మళ్లీ వీటి వైపు వినియోగదారులు చూస్తున్నారు. ముఖ్యంగా భారీ డీజిల్ ఎస్‌యూవీలను కొనేందుకు ఎగబడుతున్నారు.
అమ్మకాల జోరు
ఈ ఏడాది జూన్‌లో జరిగిన ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాల్లో డీజిల్ కార్ల వాటా 16.32 శాతంగా ఉండగా, జులై నాటికి 17.73 శాతానికి ఎగబాకింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల తీసుకుంటే డీజిల్ కార్ల విక్రయాలు ఏడాది లెక్కన 15 శాతం పెరిగి ఏకంగా 4.56 లక్షల యూనిట్లకు చేరాయి. అంతేకాకుండా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జరిగిన మొత్తం కార్ల అమ్మకాల్లో డీజిల్ బండ్ల వాటా ఏకంగా 19.39 శాతానికి చేరడం గమనార్హం. ఈ మార్పునకు ప్రధాన కారణం పెట్రోల్‌లో తీసుకొచ్చిన ‘ఈ–20’ (20 శాతం ఇథనాల్ మిశ్రమం) విధానమే.
ముడిచమురు దిగుమతులు తగ్గించుకోవడానికి కేంద్రం పెట్రోల్‌లో ఇథనాల్‌ను తప్పనిసరి చేయడంతో పాత వాహనదారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యంగా 2023 కంటే ముందు తయారైన కార్లలో ఈ ఇంధనం వాడటం వల్ల మైలేజీ పది శాతానికి పైగా పడిపోయింది. ఇంజిన్ గడగడా వణకడం, కారు స్టార్ట్ చేయడంలో ఇబ్బందులు రావడం, ఫ్యూయెల్ ఇంజెక్టర్లు పాడై తరచూ రిపేర్ల కోసం మెకానిక్ షాపుల చుట్టూ తిరగాల్సి రావడంతో వాహనదారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.
లోకల్ సర్కిల్ రిపోర్ట్ ప్రకారం, 2023 కంటే ముందు కొన్న ప్రతి 10 మంది కారు ఓనర్లలో ఆరుగురు ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొత్త కార్లకు ఇది సురక్షితమేనని చమురు సంస్థలు చెబుతున్నా, మైలేజీ తగ్గి ఖర్చుల భారం పెరగడంతో కస్టమర్లు షోరూమ్‌లలో మళ్లీ డీజిల్ కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు.
ఎస్‌యూవీలకు డిమాండ్
భారతీయుల్లో స్కార్పియో, బొలెరో, థార్, ఎక్స్‌యూవీ 700, కియా సెల్టోస్ వంటి పెద్ద కార్లకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మహీంద్రా స్కార్పియో 86 వేల యూనిట్లు, బొలెరో 58 వేల యూనిట్లు, ఎక్స్‌యూవీ 7ఎక్స్‌ఓ 42 వేల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. టాప్ 10 డీజిల్ ఎస్‌యూవీలలో ఆరింటి అమ్మకాలు రెండంకెల వృద్ధి సాధించాయి.
బరువైన పెద్ద వాహనాలను లాగాలన్నా, ఎక్కువ మంది ప్రయాణికులతో కొండ ప్రాంతాలు, గతుకుల రోడ్లపై సులువుగా వెళ్లాలన్నా ఆధునిక డీజిల్ ఇంజిన్లు ఇచ్చే అధిక శక్తి (లో-ఎండ్ టార్క్) పెట్రోల్ ఇంజిన్లలో లభించదు. దీనికితోడు ఏడాదికి 25,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించే వారికి, ట్యాక్సీ నిర్వాహకులకు డీజిల్ అందించే మైలేజీ ఎంతో లాభదాయకంగా ఉంటోంది. ఢిల్లీ మినహా మిగిలిన చోట్ల డీజిల్ ఎస్‌యూవీలపై పెద్దగా రిస్ట్రిక్షలేం లేవు. దీంతో వీటి అమ్మకాలు తగ్గడం లేదు.
