ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

ముషీరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ ప్రొఫెసర్  కోదండరాం హామీ ఇచ్చారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జీవో 1273 అమలు చేయాలని సంఘ నాయకులు ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. 

సమైక్య అధ్యక్ష, కార్యదర్శులు చొప్పరి శంకర్  ముదిరాజ్, పులగం మోహన్  మాట్లాడుతూ 2008లో అప్పటి సీఎం వైఎస్సార్​ హయాంలో వెయ్యి గంటల శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారని గుర్తు చేశారు. 36 వేల మంది చలాన్లు కడితే, 12,900 మందికి మాత్రమే శిక్షణ పూర్తయిందని, మిగిలిన వారికి శిక్షణ ఇవ్వడంతో పాటు ట్రైనింగ్​ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ట్రైనింగ్​ సర్టిఫికెట్లు లేని కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న తమపై పోలీసులు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, తమను దొంగ డాక్టర్లుగా ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు కమ్యూనిటీ పారామెడిక్స్  శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించాలని కోరారు. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో తమను భాగస్వాములను చేయాలని డిమాండ్  చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యలపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆసంఘ నేతలు లెక్కల నగేశ్, ఉపాధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు, తన్నీరు సత్యనారాయణ, గుండ్ల బాలరాజు, శంకరయ్య, నవీన్ కుమార్, రంగు రవీందర్, రవి వర్మ, శ్రీనివాస్, మల్సూర్  పాల్గొన్నారు.