- తప్పుంటే నన్ను జైల్లో వేయాల్సింది.. అమ్మపై పగ ఎందుకు?
- సీఎం రేవంత్ బ్లాక్‌మెయిల్‌తోనేఅధిష్టానం నిర్ణయం: కొండా సుస్మిత
హైదరాబాద్, వెలుగు: ‘‘మా అమ్మ ఏం తప్పు చేసిందని ఇంతగా అవమానించారు? అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి’’ అంటూ మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. తన తల్లి అవమానానికి గురవుతారని తెలిస్తే తాను గతంలో అలా మాట్లాడేదాన్ని కాదన్నారు. తాను మాట్లాడిన మాటల్లో ఎలాంటి తప్పు లేదని మరోసారి స్పష్టం చేశారు.
‘‘పార్టీలో నేనైనా ఉండాలి.. ఆమె అయినా ఉండాలి అనే స్థాయికి ఒక సీఎం దిగజారుతారా? సామాన్య కార్యకర్త నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన మహిళపై రేవంత్‌రెడ్డి ఇంత పగ పెట్టుకుంటారని అనుకోలేదు. నేను మాట్లాడిన మాటల్లో తప్పు లేదని ఇప్పటికీ చెబుతున్నా. ఒకవేళ తప్పు ఉంటే అది నా తప్పే. నాపై కేసు పెట్టి నన్ను జైల్లో వేయాల్సింది. నేను కాంగ్రెస్ పార్టీని ఎక్కడా కించపర్చలేదు. కేవలం ఒక వ్యక్తి గురించే మాట్లాడాను’’ అని సుస్మిత అన్నారు.
తన తల్లి మంత్రిగా పనిచేసిన శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదని సుష్మిత పేర్కొన్నారు. ‘‘మా అమ్మ చేసిన ఒక్క తప్పు ఏంటో చూపించండి. తన శాఖలో చిన్న అవినీతి కూడా జరగలేదు. కొందరు మీడియా కావాలనే మా అమ్మ స్థాయిని తగ్గించేలా ప్రచారం చేస్తోంది. ఒక ఆడబిడ్డ ఉసురు ఊరికే పోదు’’ అని అన్నారు. తన తల్లి సహచర మంత్రి అయిన రేవంత్‌రెడ్డిని తిట్టమని తనకు ఎందుకు చెబుతారని ప్రశ్నించారు. ‘‘ఎమ్మెల్సీ కోసం ప్రయత్నిస్తున్న మా నాన్న.. అమ్మను అలా మాట్లాడమని ఎందుకు చెబుతారు?’’ అని నిలదీశారు.
‘బ్లాక్‌మెయిల్‌తోనే నిర్ణయం’
సీఎం రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ చేయడం వల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సోదరుల అక్రమాలకు సంబంధించిన వివరాలు తన వద్ద ఉన్నాయని, వాటిపై తర్వాత మాట్లాడతానని చెప్పారు.
