‘కోదాడ, హుజూర్ నగర్’ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

‘కోదాడ, హుజూర్ నగర్’ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గరిడేపల్లి/కోదాడ/మునగాల, వెలుగు: కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలను అభివృద్ధిలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఇరిగేషన్, సివిల్ సప్లైస్ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితో కలిసి ఆదివారంఆయన ఆయా నియోజకవర్గాల్లో పర్యటించారు.  నవోదయ విద్యాలయం, తెలంగాణ మోడల్ స్కూల్ నిర్మాణాలు, పలు ఎత్తిపోతల పథకాలను పరిశీలించారు. 

గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి నుంచి కొనాయిగూడెం మీదుగా బొలిశెట్టి వారి గూడెం వరకు రూ.7.20 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రహదారి నిర్మాణాన్ని నాణ్యతతో త్వరగా  పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడ్డిపల్లి గ్రామంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనులను పరిశీలించారు. 

హుజూర్ నగర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన పనులు తుది దశకు చేరాయని, వచ్చే విద్యానాటికి విద్యార్థులకు పూర్తి స్థాయి మౌలిక వసతులతో అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. శ్రావణ మాసం సందర్భంగా హుజూర్ నగర్ ముత్యాలమ్మ జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.