ఇస్రో ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వండి ..ఇస్రో చైర్మన్‌‌‌‌‌‌‌‌కు 9 ఉద్యోగ సంఘాల లేఖ

ఇస్రో ప్రైవేటీకరణపై స్పష్టత ఇవ్వండి ..ఇస్రో చైర్మన్‌‌‌‌‌‌‌‌కు 9 ఉద్యోగ సంఘాల లేఖ

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రాకెట్ల తయారీ, నిర్వహణ విధులను ప్రైవేట్ రంగానికి బదిలీ చేసే ప్రతిపాదనలపై స్పష్టత ఇవ్వాలని ఇస్రోలోని తొమ్మిది ఉద్యోగ సంఘాలు కోరాయి. ఈ మేరకు సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 4న సంస్థ చైర్మన్ వి.నారాయణన్‌‌‌‌‌‌‌‌కు లేఖ రాశాయి. 

సంస్థ భవిష్యత్ పాత్ర, ప్రస్తుత ఉద్యోగుల భవితవ్యం, అలాగే రాబోయే నియామకాలపై పడే ప్రభావం గురించి ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ‘‘నిర్దేశిత వాణిజ్య కార్యకలాపాల్లో ప్రైవేట్ భాగస్వామ్యం ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగంలో పటిష్టంగా ఇస్రో కొనసాగవచ్చు. 

కానీ, దేశ ప్రయోగ వాహనాల తయారీ, ప్రయోగ వేదికల నిర్వహణ వంటి కీలక బాధ్యతలను ప్రభుత్వ చేతుల నుంచి ప్రైవేట్ సంస్థలకు అప్పగించి, ఇస్రోను కేవలం ఒక చిన్న పరిశోధన & అభివృద్ధి (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ &డీ) విభాగానికే పరిమితం చేసే విధానాన్ని అంగీకరించలేం’’అని ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ‘‘భవిష్యత్తులో ఇస్రో ఎలాంటి రాకెట్లను తయారు చేయదు.

 ఆ బాధ్యతలను ప్రైవేట్ రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థలు చేపడతాయి’’అంటూ ‘ఇన్-స్పేస్’చైర్మన్ పవన్ గోయెంకా ఇటీవల చేసిన వ్యాఖ్యలను యూనియన్లు ప్రస్తావించాయి. ఈ వ్యాఖ్యలపై అంతరిక్ష శాఖ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ‘‘ఇస్రో అభివృద్ధి చేసిన సాంకేతికత జాతి సంపద. వ్యూహాత్మక భద్రత, ఉపాధి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రక్రియను పారదర్శకంగా, జవాబుదారీతనంతో చేపట్టాలి తప్ప, ఉద్యోగులు పత్రికల ద్వారా తెలుసుకునేలా ఉండకూడదు’’అని పేర్కొన్నాయి.

లక్ష్య సాధనకు భాగస్వామ్యం తప్పనిసరి: ఇన్-స్పేస్ చైర్మన్

2030 నాటికి ఏడాదికి 50 ప్రయోగాలను పూర్తి చేయాలనే భారత లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇస్రో, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాల్సిందేనని పవన్ గోయెంకా ఆదివారం ‘ఎక్స్’లో స్పష్టం చేశారు.