- వర్షాభావ పరిస్థితులతో కరువు పనికి పెరిగిన డిమాండ్
- ఇందిరమ్మ ఇండ్లు, ఫాంపాండ్స్, చెరువుల తవ్వకాలతో జోరు
- రికార్డు స్థాయిలో ప్రతి రోజూ 2 లక్షలకుపైగా కూలీల హాజరు
- పనిదినాలను 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : ఎల్‌నినో కారణంగా వానలు పడకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. దీంతో గ్రామీణ పేదలు, సన్నకారు రైతులు.. బతుకుదెరువు కోసం ‘ఉపాధి’ పనుల బాట పడుతున్నారు. దీంతో ఉపాధి హామీ పనులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
గత నెల వరకు అడపాదడపా వ్యవసాయ పనుల కారణంగా ఉపాధి కూలీల హాజరు కేవలం 50 వేల నుంచి 70 వేలలోపే నమోదైంది. కానీ, వర్షాభావ పరిస్థితులు తీవ్రం కావడంతో సెప్టెంబర్ ఆరంభం నుంచే ఉపాధి హాజరు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తాజా లెక్కల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 3న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,08,875 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. 31 జిల్లాల్లోని 75,654 పనుల వద్ద 93,179 మస్టర్లలో కూలీల పేర్లు నమోదయ్యాయంటే క్షేత్రస్థాయి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా మే, జూన్ లో మాత్రమే ఉపాధి పనులకు డిమాండ్ ఉంటుంది. కానీ వర్షాకాలంలో సైతం ఇంత డిమాండ్ కనిపించడం విశేషం. ఉపాధి పనులకు డిమాండ్ పెరుగుతుండడంతో పనిదినాలను 150 రోజులకు పెంచాలని రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేస్తోంది.
టాప్ లో నల్గొండ
ఉపాధి పనుల కల్పనలో నల్గొండ జిల్లా ముందంజలో నిలిచింది. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో సగటున రోజుకు 14 వేలకు పైగా కూలీలు పనులకు హాజరవుతుండగా, సూర్యాపేట జిల్లా 12 వేల పనిదినాలతో రెండో స్థానంలో నిలిచింది. వీటి తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో రోజుకు 8 నుంచి 9 వేలకుపైగా కూలీల హాజరవుతున్నారు.
అయితే, కొన్ని జిల్లాల్లో ఉపాధి పనులు మందకొడిగా సాగుతున్నాయి. పట్టణీకరణ, స్థానికంగా పనుల గుర్తింపు లేకపోవడానికి తోడు, కొన్ని జిల్లాల్లో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండడం వల్ల హాజరు శాతం పడిపోయింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, పెద్దపల్లి, హనుమకొండ జిల్లాల్లో కూలీల సంఖ్య 5 వేలలోపే నమోదవుతోంది.
ఇందిరమ్మ ఇండ్ల అనుసంధానంతో...
ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం సైతం కూలీల సంఖ్య పెరగడానికి మరో కీలక కారణంగా తెలుస్తోంది. ప్రతి ఇంటి నిర్మాణానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తూ 90 రోజుల పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీనికి సంబంధించి రోజువారీ కూలీ సుమారు రూ.300 చొప్పున దాదాపు రూ.27 వేలు లబ్ధిదారుల ఖాతాల్లో పడే వెసులుబాటు ఉండడంతో ఇంటి పునాదులు, మట్టి పనులు చేసుకునేందుకు రోజువారీ కూలీ గిట్టుబాటు అవుతుండడంతో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో మస్టర్లలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. సొంత ఇంటి నిర్మాణంలో పనిచేసుకుంటూనే ఉపాధి హామీ కూలీ పొందుతున్నారు.
పొలం కుంటలు, ఫారమ్ పాండ్స్ పనులే ఎక్కువ..
కరువు ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం గ్రామాల్లో ఫారం పాండ్లు, పశువుల తొట్లు, కమ్యూనిటీ చేపల చెరువుల తవ్వకాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ పనులకు నిధుల కేటాయింపు భారీగా ఉండడంతో పంచాయతీల్లో అధికారులు ముమ్మరంగా పనులు కల్పిస్తున్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు రైతుల పొలాల్లో పెద్ద ఎత్తున కుంటల తవ్వకాలు చేపట్టారు.
నీటి నిల్వతో పాటు అదనపు ఆదాయం కోసం పంచాయతీల పరిధిలో సామూహిక చేపల చెరువుల నిర్మాణాలు చేపట్టారు. ఫీడర్ ఛానల్స్, చెరువుల పూడికతీత పనుల్లో వందలాది మంది కూలీలు నిమగ్నమయ్యారు. నల్గొండ, సూర్యాపేట, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఈ పనులు రికార్డు స్థాయిలో నడుస్తున్నాయి.
ఈ నెల 3న ఆల్ టైమ్ రికార్డు
ఎన్ఎంఎంఎస్ యాప్ ద్వారా వర్క్ సైట్ల వద్దే రెండు పూటలా జియో ట్యాగింగ్‌తో కూలీల ఫొటోలు తీసి అప్‌లోడ్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా దొంగ మస్టర్లకు తావు లేకుండా పక్కాగా నమోదవుతున్న ఈ లెక్కల్లో హాజరు విస్మయం కలిగిస్తోంది.
గత నెల 30న ఆదివారం కావడంతో కూలీల సంఖ్య 33 వేలకు పడిపోయినప్పటికీ, ఆ తర్వాతి రోజు నుంచే గ్రాఫ్ భారీగా పెరిగింది. ఈ నెల 3న రాష్ట్రవ్యాప్తంగా 75,654 వర్క్‌సైట్లలో ఏకంగా 2,08,875 మంది కూలీలు పనిచేసి ఈ సీజన్‌లోనే రికార్డు సృష్టించారు. శుక్ర, శనివారాలు 2.04 లక్షలపైగా కూలీలు హాజరు కావడం విశేషం.
