- రాష్ట్రంలో రోగాల డేటా ఎక్కించని సగం దవాఖానాలు
- గతేడాది ఏకంగా 47.36 శాతం హాస్పిటల్స్ ‘నెవర్ రిపోర్టెడ్’
- అధికారుల నిఘా లోపంతో నమోదుకాని అంటువ్యాధులు
- సగం హాస్పిటల్స్ సమాచారమే రాష్ట్రం మొత్తం లెక్కలుగా ప్రచారం
- ముందస్తు హెచ్చరికలు అందక క్షేత్రస్థాయిలో జ్వరాల విజృంభణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విష జ్వరాలు, డెంగ్యూ, మలేరియా సమాచారాన్ని నమోదు చేయడంలో వైద్యారోగ్య శాఖ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. అంటువ్యాధుల విస్తరణను ఎప్పటికప్పుడు కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్ (ఐహెచ్‌ఐపీ) పోర్టల్‌ను రాష్ట్రంలోని దవాఖానాలు గాలికొదిలేశాయి.
2025లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం రిపోర్టింగ్ యూనిట్లలో ఏకంగా 47.36 శాతం హాస్పిటల్స్ పోర్టల్‌లో కనీసం ఒక్కసారి కూడా లాగిన్ కాకుండా ‘నెవర్ రిపోర్టెడ్’లిస్టులో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది. దాదాపు సగం దవాఖానాల నుంచి సమాచారమే రానప్పుడు రాష్ట్రంలో జ్వరాలు, అంటువ్యాధులు అదుపులోనే ఉన్నాయని అధికారులు ఏ లెక్కల ఆధారంగా ప్రకటిస్తున్నారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 6 వేల వరకు ప్రభుత్వ, మరో 4 వేలకు పైగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అయితే, ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో అసలు డేటా నమోదు చేయని 47.36 శాతం యూనిట్లలో అత్యధికంగా దాదాపు 40 శాతం ప్రైవేటు హాస్పిటల్స్, మరో 10 శాతం మేర ప్రభుత్వ కేంద్రాలే ఉన్నట్లు తెలుస్తోంది.
క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం, అంటువ్యాధుల నియంత్రణ ప్రకారం ప్రైవేటు హాస్పిటల్స్ తమ వద్దకు వచ్చే ప్రతి డెంగ్యూ, మలేరియా, ఇతర విష జ్వరాల కేసులను ప్రభుత్వ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలి. కానీ, మెజారిటీ ప్రైవేటు యాజమాన్యాలు ఈ రూల్స్‌ను బుట్టదాఖలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
పోర్టల్‌ను పూర్తిస్థాయిలో వాడాలని, 2026–-27 నాటికి వంద శాతం పీ–-ఫామ్ (డాక్టర్లు నిర్ధారించిన కేసులు) ఎంట్రీ సాధించాలని కేంద్రం టార్గెట్ పెట్టినా, క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
ఆశాల టెస్టుల్లోనే 269 మలేరియా పాజిటివ్‌లు..
రాష్ట్రంలో వార్షిక మలేరియా వ్యాప్తి సూచీ 0.006 వద్ద అతి తక్కువగా ఉందని అధికార యంత్రాంగం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో వార్షిక రక్త పరీక్షల రేటు జాతీయ ప్రమాణాల కంటే తక్కువగా నమోదైందని కేంద్రం ఎత్తిచూపింది.
అసలు రక్త పరీక్షలే విస్తృతంగా చేయనప్పుడు రోగాలు ఎలా బయటపడతాయన్నది అసలు ప్రశ్న. మరోవైపు.. గ్రామాల్లో ఆశా కార్యకర్తలు నిర్వహించిన స్లైడ్ పరీక్షల్లోనే ఏకంగా 269 మలేరియా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఇక కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చేరిన రోగుల వివరాలను పూర్తిగా నమోదు చేసి ఉంటే వాస్తవ సంఖ్య భారీగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
డీపీహెచ్, డీఎంహెచ్‌వోల పర్యవేక్షణ శూన్యం...
ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్ నుంచి అంటువ్యాధుల సమాచారాన్ని సేకరించి పోర్టల్‌లో నమోదు చేయించే పూర్తి బాధ్యత జిల్లాల స్థాయిలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ల (డీఎంహెచ్‌వో) పరిధిలోనే ఉంటుంది. డీపీహెచ్ పర్యవేక్షణలో వీరు పనిచేయాల్సి ఉంటుంది. డీఎంహెచ్‌వోలపై సరైన పర్యవేక్షణ, సమీక్షలు లేకపోవడంతో జిల్లా అధికారులు నిఘా వ్యవస్థను పూర్తిగా గాలికొదిలేశారనే విమర్శలు వస్తున్నాయి.
పోర్టల్‌లో లాగిన్ అవ్వని ప్రైవేటు హాస్పిటల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం గానీ, కనీస తనిఖీలు చేపట్టడం గానీ జరగడం లేదు. ఉన్నతాధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకుని ప్రైవేటు మేనేజ్‌మెంట్లు ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నాయి.
కేంద్రం నిధులకు కోత పెట్టే ప్రమాదం..
విష జ్వరాలు ప్రబలిన వెంటనే ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లోని జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా వచ్చే ముందస్తు హెచ్చరికలతోనే యంత్రాంగం ఫాగింగ్, పైరెత్రమ్ పిచికారీ, లార్వా నివారణ చర్యలు చేపడుతుంది. అయితే, హాస్పిటల్స్ డేటా ఎక్కించకపోవడంతో ఏ ఊరిలో ఏ రోగం ముదురుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ముందస్తు అంచనాలు లేక క్షేత్రస్థాయిలో మందులు, సెలైన్లు, డెంగ్యూ ఎలీసా కిట్ల సరఫరాలో జాప్యం ఏర్పడుతోంది.
ఈ నిర్లక్ష్యం ప్రజారోగ్యాన్ని ముప్పులోకి నెట్టడమే కాకుండా జాతీయ స్థాయిలో రాష్ట్రానికి నష్టాన్ని కూడా తీసుకొస్తోంది. అంటువ్యాధుల నిఘా సమాచారం ఆధారంగా నీతి ఆయోగ్ ఏటా ఇచ్చే ‘స్టేట్ హెల్త్ ఇండెక్స్’ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అట్టడుగుకు పడిపోయే ముప్పు ఏర్పడుతోంది. అలాగే, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన ‘ఇన్సెంటివ్ పూల్’నిధులకు కేంద్రం కత్తెర వేసే ప్రమాదం ఉంది.
ఇప్పటికైనా ప్రజారోగ్య వ్యవస్థను దారిలో పెట్టాలి..
ఇప్పటికైనా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నది. మంత్రుల రివ్యూలలో కాకి లెక్కలు చెప్పడం మానుకుని, క్షేత్రస్థాయి వాస్తవాలను గుర్తించాలి. డీపీహెచ్ వెంటనే రంగంలోకి దిగి అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. కేంద్ర పోర్టల్‌లో లాగిన్ కాకుండా మొండికేస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే రిజిస్ట్రేషన్ల రద్దుకు వెనుకాడకూడదు.
అదే సమయంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్న సిబ్బందికి తగిన తోడ్పాటు అందించి, వంద శాతం ఐహెచ్‌ఐపీ రిపోర్టింగ్ జరిగేలా చూడాలి. అప్పుడే రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ గాడినపడి, సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ లభిస్తుందని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు.
