న్యూఢిల్లీ: దేశంలో సరుకు రవాణాకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు (డీఎఫ్‌సీ) కొత్త దారి చూపిస్తున్నాయి. డీఎఫ్‌సీసీఐఎల్ ఆధ్వర్యంలో 1,337 కి.మీ. ఈస్టర్న్ డీఎఫ్‌సీ, 1,506 కి.మీ. వెస్ట్రన్ డీఎఫ్‌సీ నిర్మించారు. దీంతో మొత్తం 2,843 కి.మీ. ప్రత్యేక సరుకు మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. మార్చి 31, 2026న వైతర్ణా-జేఎన్‌పీటీ మధ్య 102 కి.మీ. మార్గం పూర్తవడంతో వెస్ట్రన్ డీఎఫ్‌సీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. దీంతో జేఎన్‌పీటీ వరకు డబుల్‌స్టాక్ కంటైనర్ రైళ్లు నడిపే అవకాశం ఏర్పడింది. ఆగస్టు 31 నాటికి డీఎఫ్‌సీలపై 5.21 లక్షల సరుకు రైళ్ల ట్రిప్పులు నమోదయ్యాయి. రోజుకు సగటున 435 రైళ్లు నడుస్తున్నాయి.
వీటి ద్వారా 658 బిలియన్ జీటీకేఎం, 360 బిలియన్ ఎన్‌టీకేఎం సరుకు రవాణా పనితీరు నమోదైంది. ప్రత్యేక మార్గాలతో ప్రయాణికుల రైళ్ల మార్గాల్లో రద్దీ తగ్గడంతోపాటు సరుకు రవాణా వేగం పెరుగుతోంది. పరిశ్రమలు, పోర్టులు, లాజిస్టిక్స్ కేంద్రాలతో అనుసంధానానికి గతి శక్తి కార్గో టెర్మినళ్లు ఏర్పాటు చేస్తున్నారు. కొత్త మార్కెట్ల కోసం టీఓటీ, జేపీపీ-ఆర్‌సీఎస్ సేవలు ప్రారంభించారు. 2025-26లో టీఓటీ ద్వారా రూ.49.10 కోట్ల ఆదాయం వచ్చింది. అదే ఏడాది డీఎఫ్‌సీలపై సరుకు రవాణా 13.74 శాతం పెరిగింది. ఇక కొత్త వినియోగదారులను చేర్చడం, మరిన్ని సరుకు రైళ్లను నడపడం, కారిడార్ల సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించడంపై అధికారులు దృష్టి పెడుతున్నారు.
