ఢిల్లీలో కూలిన హాస్టల్ బిల్డింగ్ ..ఐదుగురు మృతి.. 11 మంది రెస్క్యూ

ఢిల్లీలో కూలిన హాస్టల్ బిల్డింగ్ ..ఐదుగురు మృతి.. 11 మంది రెస్క్యూ
  • మరో 20 మంది దాకా శిథిలాల కిందే..!
  • సౌత్ ఢిల్లీలోని సత్య నికేతన్‌‌లో పెను విషాదం
  • సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు

 న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం సౌత్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీలోని రద్దీ ప్రాంతమైన సత్య నికేతన్‌‌‌‌‌‌‌‌లో ఐదంతస్తుల బాయ్స్ పీజీ హాస్టల్ భవనం కుప్పకూలింది. మధ్యాహ్నం 1:34 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు మృతి చెందారు. 

శిథిలాల కింద 20 మంది వరకు చిక్కుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. భవనం బేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో నిర్మాణ పనులు జరుగుతుండగా  కూలిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి సుమారు 12 అగ్నిమాపక వాహనాలు చేరుకున్నాయి. భారీ కాంక్రీట్ స్లాబ్‌‌‌‌‌‌‌‌లు, ఇనుప గడ్డర్లను తొలగించేందుకు ఎక్స్‌‌‌‌‌‌‌‌కవేటర్లు, ఆధునిక యంత్రాలను తరలించారు. 

ఎన్డీఆర్ఎఫ్, ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది, క్యాట్స్ అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకొని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి. కాగా, ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. భవనం మరమ్మత్తుల్లో భాగంగా ఓ పిల్లర్​ను పక్కకు జరపడం వల్లే బిల్డింగ్ కుప్పకూలిందని చెప్పారు. ఇప్పటి వరకు 11 మంది విద్యార్థులను కాపాడామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు.

సొంతూరుకు వెళ్లడంతో తప్పిన ముప్పు

ఈ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువగా కేరళ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చి సమీపంలోని మోతీలాల్ నెహ్రూ, ఏఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌డీ, వెంకటేశ్వర కాలేజీల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఉంటున్నారు. వీకెండ్ కావడంతో చాలామంది విద్యార్థులు ఇండ్లకు వెళ్లడం వల్ల పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ సుమారు 50  మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దాదాపు 20 ఏళ్ల నాటి ‘హాస్టల్ డేజ్’ అనే ఈ భవనం బేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బేస్ మెంట్ లోకి నీరు చేరడంతో పునాదులు బలహీనపడ్డాయని పేర్కొన్నారు. 

ఢిల్లీ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌‌‌‌‌‌‌‌కు సమీపంలో ఉండటంతో ఇక్కడి ఇండ్లను పీజీ హాస్టల్స్‌‌‌‌‌‌‌‌గా మార్చి ఒక్కో బెడ్‌‌‌‌‌‌‌‌కు నెలకు రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారని, ఎలాంటి నిర్వహణ చేపట్టడంలేదని విద్యార్థులు మండిపడుతున్నారు. భవన యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

శిథిలాల కింది నుంచి ఫోన్ కాల్స్

శిథిలాల కింద చిక్కుకున్న పలువురు విద్యార్థులు తమ స్నేహితులకు ఫోన్ చేసి కాపాడాలంటూ వేడుకుంటున్నారని సౌత్ వెస్ట్ ఢిల్లీ ఎమ్మెల్యే అనిల్ శర్మ మీడియాకు తెలిపారు. ప్రమాదం విషయం తెలిసి వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. ‘‘ఇది ఎంతో విచారకరమైన ఘటన. వివిధ ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఇక్కడి పీజీ హాస్టల్లో ఉంటున్నారు. 

శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థుల్లో కొందరు ఫోన్లు చేసి తమ పరిస్థితిని చెబుతున్నారు. ఇప్పటికే పలువురిని రక్షించాం. వారందరినీ సేఫ్​గా బయటకు తీసుకురావడానికి కృషి చేస్తున్నాం” అని అనిల్ శర్మ తెలిపారు. 

అందరినీ కాపాడాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐదు అంతస్తుల బాయ్స్ పీజీ భవనం కుప్పకూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం 'ఎక్స్' వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘సత్యనికేతన్‌‌‌‌‌‌‌‌లో భవనం కూలిన వార్త అత్యంత హృదయవిదారకంగా ఉంది.

 శిథిలాల కింద డీయూ విద్యార్థులు సహా పలువురు చిక్కుకోవడం కలవరపరుస్తోంది’ అని పేర్కొన్నారు. కళాశాలల్లో సరైన హాస్టల్ వసతులు లేకపోవడం వల్లే విద్యార్థులు ఇలాంటి ప్రమాదకర పీజీల్లో నివసించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

 ‘ఒక్కో గదిలో 40 మంది చొప్పున అగమ్యగోచర పరిస్థితుల్లో తలదాచుకుంటున్నారు. విద్యార్థుల ప్రాణాలు అత్యంత విలువైనవి, వారి రక్షణకు అన్ని పరిస్థితుల్లోనూ పెద్దపీట వేయాలి’ అని రాహుల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.