బెంగాల్ సర్కారుకు సీజేపీ అల్టిమేటం ..దుండగుల దాడిలో సీజేపీ వలంటీర్ తండ్రి మృతి

బెంగాల్ సర్కారుకు సీజేపీ అల్టిమేటం ..దుండగుల దాడిలో సీజేపీ వలంటీర్ తండ్రి మృతి
  • ఆయన జ్ఞాపకార్థం స్కూల్ నిర్మించాలని డిమాండ్

కోల్‌‌‌‌కతా: పశ్చిమ బెంగాల్‌‌లోని బాంకురా జిల్లాలో సంచలనం సృష్టించిన అబ్దుల్ తండ్రి హత్య కేసులో కాక్రోచ్ జంతా పార్టీ (సీజేపీ) ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేసింది. అబ్దుల్ తండ్రి జ్ఞాపకార్థం ఆ ప్రాంతంలో పాఠశాలను నిర్మించాలని, ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరిపించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లను నెరవేర్చేందుకు సెప్టెంబర్ 7 వరకు డెడ్‌‌లైన్ విధించామని, అప్పటివరకు స్పందించకపోతే బాంకురా కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించింది. బాంకురా జిల్లాలోని కరిసుంద గ్రామానికి చెందిన 25 ఏండ్ల సీజేపీ వలంటీర్ అబ్దుల్ హఫీజ్.. ‘స్కూల్ థీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా స్థానిక పాఠశాల దుస్థితిని వీడియో తీయడంతో ఈ వివాదం చెలరేగింది.

ఈ నేపథ్యంలోనే దుండగులు అబ్దుల్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన హఫీజ్ తండ్రి షేక్ మహమ్మద్ మాఫిక్ మృతి చెందాడు. ఈ ఘటనపై సీజేపీ నేతలు స్పందిస్తూ.. అబ్దుల్ కుటుంబంపై జరిగిన దాడి వెనుక రాజకీయ నేతల ప్రమేయం ఉందని, పథకం ప్రకారమే కరెంట్ కట్ చేసి ఈ అటాక్ చేశారని ఆరోపించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులపై కూడా రెండోసారి దాడి జరిగిందని తెలిపారు. ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ స్థానిక పోలీసులు తగిన రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.