యాదగిరిగుట్టలో వైభవంగా ‘రుక్మిణీ కల్యాణం’.. ఉట్లోత్సవం, రుక్మిణీ కల్యాణంతో ముగిసిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు

యాదగిరిగుట్టలో వైభవంగా ‘రుక్మిణీ కల్యాణం’.. ఉట్లోత్సవం, రుక్మిణీ కల్యాణంతో ముగిసిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంతో పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్టలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఈ నెల 4న మొదలైన ఉత్సవాలు మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా 4న శ్రీకృష్ణ జయంతిని నిర్వహించిన అర్చకులు, 6న ఆదివారం సాయంత్రం చేపట్టిన ఉట్లోత్సవం, రాత్రి రుక్మిణీ కల్యాణంతో కృష్ణాష్టమి వేడుకలకు పరిసమాప్తి పలికారు. 

శ్రీవైష్ణవ సంప్రదాయం, పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం నరసింహుడి క్షేత్రంలో మూడు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి కణ్ణన్ తిరునక్షత్ర ఉత్సవాలను అంగరంగవైభవంగా నిర్వహించారు. కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా ప్రధానాలయ తూర్పు వైపున సాయంత్రం 5 గంటలకు మొదలైన శిఖ్యోత్సవం(ఉట్లోత్సవం) గంట పాటు కన్నులపండువగా జరిపారు. ఉట్లు కొట్టడం కోసం ఆలయ సిబ్బందితో పాటు స్థానిక యువకులు పోటీ పడ్డారు. ఆలయ ఈవో భవానీ శంకర్ ఉట్లోత్సవాన్ని ప్రారంభించి ఆలయ సిబ్బందితో కలిసి ఉట్లు కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు.

కన్నులపండువగా రుక్మిణీ కల్యాణం

యాదగిరిగుట్ట నరసింహుడి క్షేత్రంలో ఆదివారం రాత్రి రుక్మిణీ కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. రాత్రి‌‌‌‌‌‌‌‌ 8 గంటలకు మొదలైన రుక్మిణీ దేవి కల్యాణం రెండు గంటల పాటు నయనానందకరంగా నిర్వహించారు. ముళ్లోకాది దేవతలు చూస్తుండగా శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి మెడలో తాళిబొట్టు కట్టే ఘట్టాన్ని ఆలయ అర్చకులు, వేదపండితులు వైభవోపేతంగా నిర్వహించారు.‌‌‌‌‌‌‌‌ 

మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పారాయణీకుల పారాయణాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీకృష్ణపరమాత్ముడు రుక్మిణీదేవిని వివాహమాడిన తంతును ఘనంగా జరిపించారు.‌‌‌‌‌‌‌‌