హైదరాబాద్, వెలుగు: జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీల్లో తెలంగాణ బీసీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. కర్నాటకలోని మైసూర్‌లో ఈనెల 1 నుంచి 5 వరకు నిర్వహించిన ‘యూత్ అండ్ జూనియర్ మల్టీక్లాస్ సెయిలింగ్ చాంపియన్‌షిప్-2026’లో మన విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో మొత్తం మూడు పతకాలను గెలుచుకున్నారు. ఈ మేరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) సెక్రటరీ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో ఈ వివరాలను వెల్లడించారు.
మిక్స్‌డ్ క్లాస్ విభాగంలో కామారెడ్డి జిల్లా బీసీ గురుకుల విద్యార్థిని సుంచనకోట రిష్విత స్వర్ణ పతకాన్ని సాధించగా, ఇదే విభాగంలో హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట బీసీ గురుకుల విద్యార్థిని జల్లమ్మగారి శిరీష రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే బాయ్స్ విభాగంలో హైదరాబాద్‌లోని శామీర్‌పేట్ బీసీ గురుకుల విద్యార్థి ధనుష్ జక్కుల అద్భుతంగా రాణించి కాంస్య పతకాన్ని సాధించారు. ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగంలో నల్గొండ జిల్లా మునుగోడు బీసీ గురుకుల విద్యార్థి హనుమంతు గట్టి పోటీనిచ్చి, మొత్తం 24 మంది సెయిలర్లలో 14వ స్థానంలో నిలిచారు.
అభినందనలు తెలిపిన మంత్రి పొన్నం
బీసీ గురుకుల విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేలా సొసైటీ నిరంతరం కృషి చేస్తోందని సెక్రటరీ సైదులు తెలిపారు. ‘యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్’ ద్వారా నిపుణుల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రొఫెషనల్ సెయిలింగ్ శిక్షణతో పాటు జాతీయ స్థాయి పోటీ అనుభవాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. జాతీయ సెయిలింగ్ పోటీల్లో పతకాలు సాధించిన విద్యార్థులతో పాటు, వారికి శిక్షణ అందించిన యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నిర్వాహకులను, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, గురుకులాల కమిషనర్ బాల మాయాదేవి అభినందించారు.
