గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు.. బాసరలో రూ.20 కోట్లతో ఘాట్ల అభివృద్ధి పనులు

గోదావరి పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు.. బాసరలో రూ.20 కోట్లతో ఘాట్ల అభివృద్ధి పనులు
  • శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు

బాసర, వెలుగు : వచ్చే ఏడాది జూన్ 27 నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. పుష్కరాలకు ఏడాది ముందుగానే మౌలిక వసతులు, పుష్కర ఘాట్లు, ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఆదివారం బాసరలో పర్యటించిన ఆయన ఆలయ అభివృద్ధి, పుష్కర ఘాట్లు, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. 

అనంతరం గోదావరి నదికి ప్రత్యేక పూజలు చేసి, బాసర అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలయ ప్రాంగణాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. భవిష్యత్‌‌‌‌లో పెరగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్లుగా వసతులు కల్పించాలని సూచించారు. గోదావరి పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఘాట్లను అవసరమైన మేరకు విస్తరించడంతో పాటు, కొత్త ఘాట్ల నిర్మాణం, రిపేర్లు చేపట్టాలని చెప్పారు. 

మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు, మరుగుదొడ్లు, మొబైల్ టాయిలెట్లు నిర్మించాలని, పుష్కర ప్రాంతాల్లో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేయాలని, డాక్టర్లు, మందులు, అంబులెన్స్‌‌‌‌లను సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టాలన్నారు. పోలీసు, రెవెన్యూ, దేవాదాయ, వైద్య, మున్సిపల్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

అనంతరం ఈవో ఆఫీస్ లో రివ్యూ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పుష్కరాల కోసం సుమారు రూ.వెయ్యి కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. పుష్కర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రజాభవన్‌‌‌‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. గోదావరి నదీ తీర ప్రాంతాల్లో 12 చోట్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ  దండే విఠల్, ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, అడిషనల్ కలెక్టర్ బి.వెంకటేశ్వర్లు, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయి కిరణ్, ఈవో అంజనా దేవి, తహసీల్దార్ పవన్ చంద్ర పాల్గొన్నారు.