- ప్రతిపక్ష నేత పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలి
- ఆ పదవిని అపహాస్యం చేయొద్దు
- పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్
- ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశా: మంత్రి పొన్నం
- ఆరు గ్యారంటీలను అమలు చేశాం: మంత్రి వివేక్
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా
హైదరాబాద్, వెలుగు: పదేండ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని కోరుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన అసెంబ్లీకి వచ్చి ఏ అంశంపై మాట్లాడినాప్రభుత్వం సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, గడ్డం వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయిందని తెలిపారు. రెండున్నర ఏండ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీల మహిళలు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. "ఉచిత బస్ ప్రయాణం చేసే వాళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు లేరా..? ఉచిత ప్రయాణంపై విమర్శలు చేయడానికి సిగ్గుందా..?" అని ప్రశ్నించారు. ఉచిత కరెంట్ ఇస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తీరు మార్చుకోకపోతే ప్రజలు వాళ్లను ఇంకో పదేండ్లు రోడ్డుపైనే కూర్చోబెడతారని హెచ్చరించారు.
బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఏం చేశారని రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేదో ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఉద్యోగ నియామక పరీక్షలు నిర్వహించలేని దౌర్భాగ్య పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేదని, గ్రూప్-1 పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. పదేండ్ల కాలాన్ని వృథా చేసినందుకు విద్యార్థులకు ఆ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్‌కు కనపడటం లేదా?: పీసీసీ చీఫ్
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం కేసీఆర్‌కు కనపడటం లేదా..? అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ జీతం తీసుకుంటూ అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారని మండిపడ్డారు. ఫామ్‌హౌస్‌కే పరిమితమైన కేసీఆర్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత హోదాను అపహాస్యం చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు బాధ్యత గల పదవిలో ఉండాలని, కానీ మన రాష్ట్రంలో ప్రతిపక్ష నేత బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. రాబోయే కాలంలోనూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తిచూపాలి కానీ, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు.
బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు: మంత్రి వివేక్
రెండున్నర ఏండ్లలో ఆరు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వెల్లడించారు. ఈ ధర్నా నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. "దళితుడిని సీఎం చేయలేదు, మూడెకరాల భూమి ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు" అని గత ప్రభుత్వాన్ని గుర్తుచేశారు. ఇందిరమ్మ ఇండ్లను ఊరూరా నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ వెయ్యి రోజులుగా ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారని, అసెంబ్లీకి రావటం లేదని మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ విమర్శించారు. అసెంబ్లీకి రాని కేసీఆర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు.
కేసీఆర్ ప్రతిపక్ష పాత్రను పోషించలేదు: మంత్రి పొన్నం
ప్రభుత్వ ఉద్యోగి విధులకు 365 రోజులు రాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తారని.. కాంగ్రెస్ పాలనలో వెయ్యి రోజులుగా ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాని కేసీఆర్ ప్రతిపక్ష పాత్రను పోషించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. రెండున్నర ఏండ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, గ్రామాల్లో మన పథకాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని చెప్పారు.
