4 శాతం మార్గం.. 14 శాతం సరుకు..డీఎఫ్‌‌సీలతో రైల్వే సామర్థ్యం మూడు రెట్లు

4 శాతం మార్గం.. 14 శాతం సరుకు..డీఎఫ్‌‌సీలతో రైల్వే సామర్థ్యం మూడు రెట్లు

న్యూఢిల్లీ: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు (డీఎఫ్‌‌సీ) దేశంలో సరుకు రవాణాకు కొత్త ఊపునిస్తున్నాయి. రైల్వే నెట్‌‌వర్క్‌‌లో కేవలం 4 శాతం మేర ఉన్న డీఎఫ్‌‌సీల ద్వారానే 14 శాతానికి పైగా సరుకు రవాణా జరుగుతోంది. ప్రత్యేక సరుకు మార్గాలు అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల రైళ్ల రద్దీ తగ్గడంతోపాటు సరుకు రైళ్ల వేగం, సామర్థ్యం పెరుగుతున్నాయి. అధిక లోడ్‌‌తో ఎక్కువ బరువు మోయడం, పొడవైన రైళ్ల నిర్వహణ, డబుల్‌‌స్టాక్ కంటైనర్ రవాణాతో ఒక్కో సరకు రవాణా ఖర్చు తగ్గే అవకాశం ఉంది.

దీంతో రైల్వే ద్వారా భారీ స్థాయిలో సరుకు తరలింపునకు మార్గం సుగమమవుతోంది. డీఎఫ్‌‌సీల వినియోగం పెరిగే కొద్దీ రహదారులపై భారీ ట్రక్కుల రద్దీ తగ్గనుంది. దీంతో డీజిల్ వినియోగం, వాహన కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంది. మరోవైపు పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలు, లాజిస్టిక్స్ పార్కులతో అనుసంధానం ఏర్పడనుంది. దీని ద్వారా దేశ ఎగుమతులు, దిగుమతులకు మరింత ఊతం లభించనుంది. రోడ్డు రవాణాపై భారం తగ్గిస్తూ రైలు ఆధారిత సరుకు రవాణాను పెంచేందుకు డీఎఫ్‌‌సీలు కీలకంగా మారుతున్నాయి.