న్యూఢిల్లీ: అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 11 వేల నుంచి 12 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో ఈ నియామకాలు చేపడతామని ఎస్‌బీఐ ఛైర్మన్ సి.ఎస్. శెట్టి వెల్లడించారు.
మార్చి 2026 నాటికి 2.45 లక్షల మందికి పైగా ఉద్యోగులతో దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన సంస్థల్లో ఒకటిగా ఉన్న ఎస్‌బీఐ, గత ఆర్థిక సంవత్సరంలో (2025–26) మొత్తం 25,633 మందిని నియమించుకుంది. అయితే, గత ఏడాది 1,500 మంది ఐటీ స్పెషలిస్ట్ ఆఫీసర్లను చేర్చుకోవడంతో ఈసారి ఐటీ విభాగంలో పెద్ద ఎత్తున నియామకాలు ఉండకపోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
కార్యకలాపాల విస్తరణలో భాగంగా దేశవ్యాప్తంగా నికరంగా 200 నుంచి 250 కొత్త బ్రాంచీలను ప్రారంభించనున్నట్లు శెట్టి తెలిపారు. కొత్త రెసిడెన్షియల్ ఏరియా, కమర్షియల్ ఏరియాల్లో సేవల విస్తరించేందుకు నియామకాలు చేపడుతున్నామని తెలిపారు.
మరోవైపు, దేశ చరిత్రలోనే అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా రాబోతున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్‌ఈ) రూ.30,000 కోట్ల ఐపీఓలో ఎస్‌బీఐ గ్రూప్ దాదాపు 1 శాతం వాటాను అమ్మనుంది.
