ఐఏఎస్ పోస్టులో ఇంటర్ ప్రిన్సిపాల్..ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా జూనియర్ ఆఫీసర్

ఐఏఎస్ పోస్టులో ఇంటర్ ప్రిన్సిపాల్..ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీగా జూనియర్ ఆఫీసర్
  • సీనియర్లను పక్కన పెట్టి అడ్డదారి నియామకమంటూ విమర్శలు
  • బీసీ, ఎస్టీ, మైనార్టీ సొసైటీలకు ఐఏఎస్, ఐఎఫ్‌‌ఎస్‌‌లు.. ఇక్కడ మాత్రం ప్రిన్సిపాల్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీ పాలన పట్టాలు తప్పింది. 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు లక్షన్నర మందికిపైగా స్టూడెంట్స్​భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన  కీలకమైన ‘ సొసైటీ సెక్రటరీ’ పోస్టులో ఐఏఎస్ అధికారిని నియమించకుండా ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ శారదకు బాధ్యతలు అప్పగించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సీనియర్ అధికారులు అందుబాటులో ఉన్నప్పటికీ వారిని కాదని జూనియర్ అధికారికి సెక్రటరీ బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సొసైటీ చరిత్రలో తొలిసారి ఐఏఎస్ లేదా గ్రూప్-1 అధికారి కాకుండా జూనియర్ అధికారిని సెక్రటరీగా నియమించారని యూనియన్ నేతలు చెబుతున్నారు. వెంటనే పూర్తిస్థాయి ఐఏఎస్ అధికారిని లేదా గ్రూప్ 1 అధికారిని సెక్రటరీగా నియమించాలని కోరుతున్నారు.  మిగతా సొసైటీలకు ఐఏఎస్‌‌లు.. ఇక్కడేం నిరక్ష్యం? రాష్ట్రంలోని బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ గురుకుల సొసైటీలకు ఐఏఎస్, ఐఎఫ్‌‌ఎస్ స్థాయి అధికారులు సెక్రటరీలుగా వ్యవహరిస్తున్నారు. కానీ ఎస్సీ గురుకుల సొసైటీకి మాత్రం ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్‌‌ను సెక్రటరీగా నియమించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నెలల కిందట మహబూబ్‌‌నగర్ కలెక్టర్‌‌గా పనిచేసిన విజయేంద్ర బోయిని సొసైటీ సెక్రటరీగా ప్రభుత్వం నియమించింది. అయితే నెల రోజులు కూడా పూర్తి కాకముందే ఆమె సెలవులోకి వెళ్లారు. అనంతరం సెక్రటరీ బాధ్యతల నుంచి రిలీవ్ అయి ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్‌‌గా కొనసాగుతున్నారు. దీంతో కనీసం గ్రూప్-1 స్థాయి అధికారినైనా సెక్రటరీగా నియమించాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గురుకులాల సమస్యలపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించే సమయంలో మిగతా సొసైటీల సెక్రటరీలు ఐఏఎస్ స్థాయిలో ఉండగా, ఎస్సీ సొసైటీ నుంచి ప్రిన్సిపాల్ స్థాయి అధికారి హాజరు కావడం ఇబ్బందిగా భావిస్తున్నారు.

గత ఏడాది కాలంలో సొసైటీ సెక్రటరీలుగా సుమారు ఐదుగురు ఐఏఎస్ అధికారులు పనిచేసి బదిలీ అయ్యారు. “ఎస్సీ గురుకుల సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఉండాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం, మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. లక్షన్నర మందికిపైగా స్టూడెంట్స్​ఉన్న సొసైటీకి ఐఏఎస్ అధికారిని నియమించాలి. సొసైటీ చరిత్రలో ఐఏఎస్ లేకుండా సెక్రటరీగా జూనియర్ అధికారిని నియమించడం ఇదే తొలిసారి.  వాళ్లు ఉంటేనే టీచర్లు, వార్డెన్స్, ప్రిన్సిపల్స్, ఆర్సీవోలు,  కింది స్ధాయి అధికారుల భయంతో పనిచేస్తుంటారు. ఇప్పిటి కైనా ఐఏఎస్ ను సెక్రటరీ పోస్టులో నియమించాలి ” అని ఓ యూనియన్ నేత తెలిపారు. 

​కలెక్టర్లతో మాట్లాడలేని పరిస్థితి

గురుకుల స్కూళ్లు, కాలేజీలు, మౌలిక వసతులు, విద్యార్థుల ఆహారం, అవాంఛనీయ ఘటనలు, ఇతర అత్యవసర సమస్యలపై సొసైటీ సెక్రటరీ జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత సెక్రటరీ ప్రిన్సిపాల్ స్థాయి అధికారి కావడంతో ప్రొటోకాల్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సొసైటీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జిల్లాల్లో కలెక్టర్‌‌తోపాటు ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని సమస్యలను పరిష్కరించాల్సిన సందర్భాల్లో హోదా ఇబ్బందిగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

దీంతో క్షేత్రస్థాయిలో గురుకులాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. లక్షన్నర మందికిపైగా విద్యార్థులు చదువుతున్న సొసైటీలో కీలక పోస్టులు ఖాళీగా ఉండటంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.  అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ పోస్టు, 3 డిప్యూటీ సెక్రటరీ పోస్టులు, ఫైనాన్స్ సెక్రటరీ పోస్టు, రాష్ర్ట వ్యాప్తంగా 150 ప్రిన్సిపాల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు