కల్తీ మద్యం తాగి 12 మంది ప్రాణాలు వదిలారు ..మద్యప్రదేశ్ లోని సాగర్జిల్లాలో ఘటన

కల్తీ మద్యం తాగి  12 మంది ప్రాణాలు వదిలారు ..మద్యప్రదేశ్ లోని సాగర్జిల్లాలో ఘటన
  •     సీఎం మోహన్​యాదవ్​ సీరియస్
  •     6 వైన్ షాపులు సీజ్ చేసిన అధికారులు​ 

సాగర్: మధ్యప్రదేశ్​లోని సాగర్​ జిల్లాలో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ప్రభావిత గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్క్రీనింగ్ నిర్వహిస్తుండగా, ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలోని 6 మద్యం దుకాణాలను అధికారులు సీజ్ చేశారు.

 ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలు ఇంకా రావాల్సి ఉందని, వైద్య పరీక్షల రిపోర్టులు వస్తేనే మరణాలకు అసలు కారణం తెలుస్తుందన్నారు. కాగా, కల్తీ మద్యం మరణాల ఘటనపై సీఎం మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన ఆయన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

సంబంధిత మంత్రులు, అధికారులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. మరోవైపు, 'బాంబే విస్కీ' పేరుతో మార్కెట్లో అమ్ముతున్న నకిలీ మద్యం గురించి కొద్ది రోజుల క్రితమే ఒక లైసెన్స్డ్ కాంట్రాక్టర్ ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేసినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి.

మెథైల్ ఆల్కహాల్ పాయిజనింగ్ కావొచ్చు: డాక్టర్లు

బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లు మాట్లాడుతూ.. రోగుల్లో సైనోసిస్ (శరీరం నీలం రంగులోకి మారడం), కండరాలు బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పటేరియా మాట్లాడుతూ.. పలువురికి చికిత్స అందుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నౌరా, ఘుగురు గ్రామాల్లో వైద్య సిబ్బంది, ఎస్డీఎం బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.