వర్షాలకు కూలిన ఇండ్లు.. యూపీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు

వర్షాలకు కూలిన ఇండ్లు.. యూపీలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు
  • ఒకే కుటుంబంలో తండ్రి, ముగ్గురు కుమార్తెల మృతి
  • కాన్పూర్, బదాయూన్, బలియా జిల్లాల్లో విషాదం

 లక్నో: ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌లో కుండపోత వర్షాలు పలు కుటుంబాలకు తీరని విషాదాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మట్టి మిద్దెలు, గోడలు కూలిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాన్పూర్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ముగ్గురు మైనర్ కుమార్తెలు మరణించగా, మరో కూతురు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. 

కాన్పూర్ జిల్లా హిర్నీ గ్రామంలో ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముకేశ్ కుమార్ అనే వ్యక్తికి చెందిన మట్టి ఇల్లు భారీ వర్షానికి ఒక్కసారిగా కుప్పకూలింది. ఇంట్లోని ఐదుగురు సభ్యులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

 గ్రామస్తులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వారిని పతారా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌‌‌‌‌‌‌‌సీ)కి తరలించగా.. అప్పటికే ముకేశ్ కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆయన కుమార్తెలు మాయ (17), నీతు (7), పల్లవి (5) మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తీవ్రంగా గాయపడిన మరో కుమార్తె కాజల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. 

డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో కాజల్ వివాహం జరగాల్సి ఉండగా, ఇంతలోనే ఈ దారుణం జరగడం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచింది. సమాచారం అందించినా సాద్ పోలీసులు సకాలంలో స్పందించలేదని, ఆసుపత్రికి వెళ్లిన సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్లే ఇంత ప్రాణనష్టం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపించారు. ఈ ఘటపై సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.

మట్టి గోడ కూలి..

బదాయూన్ జిల్లా ముసాఝాగ్ పరిధిలోని గుర్‌‌‌‌‌‌‌‌గావ్ గ్రామంలో శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి మట్టి గోడ కూలి నిద్రిస్తున్న వినోద్(35) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అతడి భార్యను స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. బలియా జిల్లా నాఫెర్‌‌‌‌‌‌‌‌పూర్ గ్రామంలో మరో విషాదం చోటుచేసుకుంది. 

నానమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చిన కీర్తి రాజ్‌‌‌‌‌‌‌‌భర్ (6) అనే చిన్నారి ఆదివారం ఉదయం కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో మట్టి గోడ ఆమెపై కూలింది. శిథిలాల నుంచి బాలికను బయటకు తీసి రస్రా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదాలపై ఆయా జిల్లాల పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్‌‌‌‌‌‌‌‌మార్టం నిమిత్తం తరలించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.