సర్‌‌‌‌ లో 50 లక్షల నోటీసులు.. రిప్లై ఇచ్చింది 18 లక్షలలోపే..నోటీసులతో ఓటర్ల టెన్షన్

సర్‌‌‌‌ లో 50 లక్షల నోటీసులు.. రిప్లై ఇచ్చింది 18 లక్షలలోపే..నోటీసులతో ఓటర్ల టెన్షన్
  • స్పందించకపోతే ఓటు అవుట్
  • డాక్యుమెంట్ల కోసం తిప్పలు
  • గడువు పెంచాలని ఈసీకి  సీఎం రేవంత్​, సీఈఓ లేఖలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల అధికారులు దాదాపు 50 లక్షల మందికి నోటీసులు జారీ చేస్తే, ఇప్పటివరకు కేవలం18 లక్షలలోపే ఓటర్లు విచారణకు హాజరయ్యారు.  

అనామలీస్(సరిపోలని వివరాలు), నో మ్యాపింగ్ కేటగిరీల కింద ఏకంగా 92 లక్షలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఈ జాబితా ఆధారంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) నోటీసులను పంపిణీ చేస్తుండగా, క్షేత్రస్థాయి నుంచి ఆశించిన స్పందన మాత్రం కనిపించడం లేదు.

నిర్దేశిత గడువులోగా విచారణకు హాజరై ఈఆర్ఓల ముందు ఓటర్లు అటెండ్ అయి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశించిన తేదీన ఓటరు రాకపోయినా.. అక్టోబర్ 15లోగా ఎప్పుడైనా రావొచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అప్పుడు కూడా హాజరుకాకపోతే తుది ఓటర్ల జాబితాలో ఓటర్లుగా పేర్లు తొలగిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నోటీసులు అందుకున్న వారు తప్పనిసరిగా అటెండ్ కావాలని అంటున్నారు.

 సరైన అవగాహన లేకపోవడం, సమయాభావం వల్ల లక్షలాది మంది అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే ముప్పు ముంచుకొస్తోంది. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో ఎవరినీ మినహాయించకుండా ఆటోమేటెడ్ వ్యవస్థ ద్వారా నోటీసులివ్వడంతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు సైతం నోటీసులు అందడం ప్రకంపనలు సృష్టిస్తోంది. కుటుంబ సభ్యుల వయసుల మధ్య వ్యత్యాసాలు, అస్పష్టమైన ఫొటోలు, సాంకేతిక లోపాల వల్ల సాఫ్ట్‌‌వేర్ గుర్తించిన అనుమానాస్పద జాబితాలోని ప్రముఖులు సైతం ఇప్పుడు తమ పేర్లను సరిచూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. 

దశాబ్దాలుగా ఒకే నియోజకవర్గంలో నివసిస్తూ, ప్రతి ఎన్నికల్లో ఓటేస్తున్న సీనియర్ సిటిజన్లు సైతం తమ పేరు జాబితాలో ఉంటుందో లేదో తెలియక విచారణ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. భారీగా నోటీసులివ్వడమే తప్ప, సరైన ప్రచారం కల్పించడంలో యంత్రాంగం విఫలమైందన్న 
విమర్శలు వస్తున్నాయి. 

రుజువులు ఎలా చూపాలి? 

నోటీసులు అందుకున్న వారిలో ముఖ్యంగా తల్లిదండ్రులతో పాటు  పిల్లలు అనమాలిస్ విభాగంలో ఉన్న కుటుంబాలే అత్యంత దారుణమైన సర్టిఫికెట్ల సమస్యను ఎదుర్కొంటున్నాయి. అంటే 2002 జాబితాలో తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వారు అనమాలీస్‌‌లో ఉండటం, ఆ తరువాత వారి పిల్లలు కూడా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. 

కుటుంబ పెద్ద పేరు, పిల్లల పుట్టిన తేదీల మధ్య తలెత్తిన సాంకేతిక అంతరాలను సరిచేసేందుకు అధికారులు ఒరిజినల్ జనన ధ్రువీకరణ పత్రాలు, స్కూల్ రికార్డులను తప్పనిసరిగా అడుగుతున్నారు. దీంతో నిరుపేదలు, వృద్ధులు, వలస జీవులు తమ ఓటు హక్కును కాపాడుకోవడం కోసం దశాబ్దాల క్రితం నాటి కాయితాలు ఏడకెళ్లి తేవాలంటూ అధికారులను నిలదీస్తున్నారు. పత్రాలు చూపించకపోతే అప్‌‌లోడ్ చేయడం సాధ్యం కాదని బీఎల్వోలు చేతులెత్తేస్తుండటంతో సామాన్యులు తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. 

పాత రికార్డులు లభించక, పుట్టిన తేదీల రుజువులు లేక అనేక  కుటుంబాలు ఓటు హక్కును రక్షించుకోలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలైన ఓటర్లను గుర్తించే ప్రక్రియ కాస్తా, పత్రాల వేటగా మారి ప్రజలను తీవ్ర ఇబ్బందులపాలు చేస్తోందన్న నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
 
గడువు పెంచాలని సర్కారు విజ్ఞప్తి.. 

క్షేత్రస్థాయిలో నెలకొన్న తీవ్ర ప్రతిష్టంభన, ప్రజల్లో వెల్లువెత్తుతున్న అసంతృప్తిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా లిస్ట్ నుంచి పోకుండా సర్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని, నోటీసుల పరిష్కారానికి ఇంకో 4 వారాల గడువు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వాస్తవానికి అక్టోబర్15 వరకు అవకాశం ఉన్నది. 

 ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు రక్షణే అత్యంత ప్రధానమని, తొందరపాటు చర్యలతో అర్హులను దూరం చేయవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో నెలకొన్న డాక్యుమెంటేషన్ ఇబ్బందులను వివరిస్తూ, ఇంత భారీ సంఖ్యలో ఉన్న నోటీసుల వెరిఫికేషన్‌‌కు ప్రస్తుతం ఇచ్చిన సమయం ఏమాత్రం సరిపోదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి సైతం ఈసీకి లేఖ రాశారు.