- రోజుల తరబడి ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ షట్ డౌన్
- పట్టింపులేని మేనేజ్మెంట్, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ కరువు
గోదావరిఖని, వెలుగు:పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్ లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. దీంతో రోజుల తరబడి షట్‌డౌన్ అవుతూ యూరియా ఉత్పత్తి నిలిచిపోతోంది. ఉత్పత్తి నిలిచిపోవడంతో రైతులకు సకాలంలో యూరియా అందించలేని పరిస్థితి నెలకొంది.
సాంకేతిక సమస్యలు పునరావృతం అవుతున్నా మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.
ఏడు రాష్ట్రాలకు యూరియా సప్లై..
తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల రైతులకు అండగా నిలిచేందుకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో యూరియా ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్లాంట్‌లో 2021 మార్చి 22 నుంచి యూరియా తయారీని ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో రోజుకు 3,850 మెట్రిక్ టన్నులు, ఏటా 12.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
జాయింట్ వెంచర్‌గా ఉన్న ఈ ప్లాంట్‌లో నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(ఎన్ఎఫ్ఎల్) 26 శాతం, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్(ఈఐఎల్) 26 శాతం, ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎఫ్‌సీఐఎల్) 11 శాతం, తెలంగాణ ప్రభుత్వం 11 శాతం, గ్యాస్ సప్లై చేసే గెయిల్(ఇండియా) లిమిటెడ్ 14.3 శాతం, టెక్నాలజీ సమకూర్చిన హెచ్‌టీఎఎస్ కన్సార్టియం 11.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
అమోనియా యూనిట్‌ను డెన్మార్క్‌కు చెందిన హోల్దోర్ టాప్సో కంపెనీ, యూరియా ప్లాంట్ ఇటలీకి చెందిన సైపెం కంపెనీ నెలకొల్పాయి. గుజరాత్‌కు చెందిన జీఐటీఎల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించే మల్లవరం నుంచి బిల్వారాకు వెళ్లే పైప్‌లైన్ ద్వారా ఈ ప్లాంట్‌కు గ్యాస్ సప్లై చేస్తున్నారు. ఈ ప్లాంట్‌లో నిత్యం సాంకేతిక సమస్యలు వస్తుండడంతో యూరియా ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది.
గత ఏడాది 114 రోజులు షట్‌డౌన్
ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో సాంకేతిక సమస్యలతో ఐదు సార్లు షట్‌డౌన్ కాగా, 114 రోజుల పాటు ప్లాంట్‌లో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. 12.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యానికి గాను 8.57 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి చేశారు. ఇలా ప్లాంట్ షట్‌డౌన్‌తో 4.13 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల్లో మూడు సార్లు షట్‌డౌన్ అయింది.
ఏప్రిల్‌లో 6 రోజులు, జులైలో 10 రోజులు షట్‌డౌన్ అయింది. ఆగస్టు 22న షట్‌డౌన్ కాగా, ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 5.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి కావాల్సి ఉండగా 4.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి జరిగింది. అంటే ఐదు నెలల్లో 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి లోటు ఏర్పడింది.
ఎందుకీ పరిస్థితి?
జూన్‌లో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌కు గెయిల్ నుంచి గ్యాస్ కేటాయింపులు తగ్గగా, జులైలో అమోనియా పైప్‌లైన్ లీకేజీ, ఆగస్టులో అమోనియా విభాగంలో పైప్‌లైన్ హెడ్ బ్లాస్ట్ కారణంగా ఉత్పత్తిని నిలిపివేశారు. ఈ ప్లాంట్‌లో స్టీమ్ పైప్‌లైన్ లీకేజీలతో సహజసిద్ధంగా ప్లాంట్ షట్‌డౌన్ అయినట్లు తెలుస్తోంది. అయితే అమోనియా విభాగానికి వెళ్లే పైప్లైన్లను ఈఐఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
పైప్ లైన్ల ఇన్స్టాలేషన్ సమయంలో సరిగా ఎరక్షన్ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడుతుందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. దీనికితోడు సహజవాయువును కృత్రిమ వాయువుగా మార్చే హాల్దోర్ టాప్సో హీట్ ఎక్స్ఛేంజ్ రిఫార్మర్(హెచ్టీఈఆర్) యూనిట్లో ఈ ఏడాది జనవరిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో మార్చి 25న ప్లాంట్ నుంచి ఈ యంత్రాన్ని రిపేర్ల నిమిత్తం ముంబైకి తరలించారు. ఐదు నెలలు గడిచినా ఈ మెషీన్‌ను తీసుకురాలేదు.
సీరియస్ గా తీసుకోని కేంద్రం
ఆర్ఎఫ్సీఎల్ మెయిన్ ఆఫీస్ నోయిడాలో ఉంది. ప్లాంట్‌కు చెందిన ఉన్నతాధికారులంతా నోయిడాలోనే ఉండడం వల్ల రామగుండం ప్లాంట్‌లో ఏర్పడే సాంకేతిక సమస్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించే అవకాశం లేకుండా పోతోంది. అందుకే నోయిడాలో ఉన్న ఆర్ఎఫ్సీఎల్ మెయిన్ ఆఫీస్‌ను రామగుండం తరలించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గతంలోనే డిమాండ్ చేశారు.
అయినా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలపై కేంద్రం, మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి సారించకపోతే ప్లాంట్ మనుగడకే ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది.
