హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ చేసిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. బీఆర్ఎస్ నేతల అత్యుత్సాహం కారణంగా.. పోలీసులకు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఈ ఆందోళనల్లో స్వల్పంగా గాయపడ్డారు.
ఈ క్రమంలో.. ప్రథమ చికిత్స తీసుకున్న కేటీఆర్ను ఆయనతో పాటు ఆందోళనలో పాల్గొన్న హరీష్ రావు పరామర్శించారు. కేటీఆర్ పక్కనే ఉన్న హరీష్ రావు దెబ్బ తాకిందేమోనని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ చేతిని, నుదుటి మీద పరిశీలించారు.
నెత్తురు కారేలా కావాలనే తమ ఎమ్మెల్యేలను కొట్టి సభకు రాకుండా అడ్డుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ టీ షర్ట్ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్తే లేని తప్పు తాము టీ షర్టులు వేసుకుని అసెంబ్లీకి వెళ్తే ఏంటని ఆయన ప్రశ్నించారు.
►ALSO READ | పోలీసుల గొంతు పిసుకుతూ.. బూతులు తిడుతూ.. అసెంబ్లీ దగ్గర రెచ్చిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏకంగా పోలీసులపై చేయి చేసుకున్న ఘటన చర్చనీయాంశమైంది. ‘‘ఇట్లనేనా కొట్టేది.. సర్వీస్లో ఉంటవా..?’’ అని ఒక పోలీస్ అధికారికి వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మరింత అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీస్ గల్లా పట్టి దుర్భాషలాడారు. పాడి కౌశిక్ రెడ్డి కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తొలి రోజు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు.
