హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి చిల్లర మాట్లాడుతున్నాడని.. పాలన చేతకాక నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్ అని అభివర్ణించారు. కాంగ్రెస్‌ది థర్డ్ క్లాస్ పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోవడం ఖాయమని అర్థమైందని.. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
సోమవారం (సెప్టెంబర్ 7) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం (సెప్టెంబర్ 6) ఎర్రవల్లిలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పకుండా హాజరుకావాలని సూచించారు. శాసనసభ, మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొనాలని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
►ALSO READ | అసెంబ్లీకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి: KCR రాజీనామాకు మహేష్ గౌడ్ డిమాండ్
అసెంబ్లీ సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్న తమకు సంఖ్యాబలమే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఆ విషయాన్ని అసెంబ్లీలో చెప్పే బాధ్యత ప్రతిపక్ష ఎమ్మెల్యేలదేనని అన్నారు. ఉభయసభల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని.. స్పీకర్ పక్షపాత వైఖరి చూపిస్తే ఎండగట్టాలని సూచించారు.
అసెంబ్లీ సమావేశాలను 20 నిర్వహించాలని బీఏసీ మీటింగ్‌లో పట్టుబట్టాలని సూచించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో ఆయన ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాడనే విషయం స్పష్టమైంది. మరోవైపు.. జీతం తీసుకుంటూ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.
