అసెంబ్లీకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి: KCR రాజీనామాకు మహేష్ గౌడ్ డిమాండ్ 

అసెంబ్లీకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోండి: KCR రాజీనామాకు మహేష్ గౌడ్ డిమాండ్ 

హైదరాబాద్: ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. జీతం తీసుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషించని కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం (సెప్టెంబర్ 6) హైదరాబాద్‎లోని ఇందిరా పార్క్ దగ్గర కాంగ్రెస్ మహాధర్నా చేపట్టింది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. 

గత ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‎ను ఆశీర్వదించి.. బీఆర్ఎస్‎కు ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆయన అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్నారు.. అందుకే కేసీఆర్‌ను ఎమ్మెల్యే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. 

కేసీఆర్‎ను ఆయన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావు అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కోరారు. ఒకవేళ అల్లుడు, కొడుక్కి అవకాశం ఇద్దామనుకుంటే అనుకుంటే కేసీఆర్ శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. 

►ALSO READ | ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ సాంస్కృతిక కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

గత బీఆర్ఎస్ పాలనలో ధనిక రాష్ట్రమైన తెలంగాణ అప్పులపాలైందని ఆరోపించారు. కేసీఆర్ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లారని.. ఓ వైపు ఆయన చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తు్న్నామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకుందని.. వెయ్యి రోజుల్లో ఎన్నో పనులు చేశామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పించాం.. రైతులకు రైతు బీమా, రైతు భరోసా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ అందిస్తున్నామని తెలిపారు. 

విద్యా, వైద్య రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గతంలో కేసీఆర్ వైద్య రంగాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. స్కిల్ యూనివర్శిటీతో యువతలో నైపుణ్యాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కులగణనలో తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును తొక్కిపెట్టి నోటికాడి కూడును అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కేంద్రం మెడలు వంచి అయినా బీసీ అంశాన్ని కులగణనలో చేర్పిస్తామని అన్నారు.