భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. కల్తీ మద్యం సేవించి 11 మంది మరణించారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అధికారుల వివరాల ప్రకారం.. సాగర్ జిల్లా కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బందా తహసీల్‌లోని నౌరాజ్, గూగ్రా ఖుర్ద్ గ్రామాల్లో కొందరు వ్యక్తులు శని, ఆదివారాల్లో మద్యం సేవించారు. మద్యం తాగిన అనంతరం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయారు.
ఇంకొందరు వాంతులు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలతో తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందిన వెంటనే సాగర్ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ), జిల్లా కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఒక పోలీసు బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆసుపత్రిలో చేరిన రోగుల చికిత్స ఏర్పాట్లను పర్యవేక్షించారు. అక్రమ మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు పోలీసులను ఆదేశించారు.
►ALSO READ | ఢిల్లీలో విషాద ఘటన.. కుప్పకూలిన స్టూడెంట్స్ పీజీ బిల్డింగ్.. శిథిలాల కింద 50 మంది..
ముందుజాగ్రత్త చర్యగా నౌరాజ్, గూగ్రా ఖుర్ద్ ప్రాంతంలోని ఏడు మద్యం దుకాణాలను సీల్ చేయడంతో పాటు, తక్షణమే నమూనాల సేకరణకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి వాంతులు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనబడుతున్న స్థానికులు ముందుజాగ్రత్తగా వైద్య పరీక్షల కోసం వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీఎం తీవ్ర దిగ్భ్రాంతి:
సాగర్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి 11 మరణించగా.. మరి కొందరు అస్వస్థతకు గురి కావడంపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సంబంధిత మంత్రి, అధికారులను వెంటనే సంఘటనా స్థలాన్ని సందర్శించాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటుందని, సమగ్ర విచారణ జరుపుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలను సహించబోమని స్పష్టం చేశారు.
