ప్రముఖ తెలుగు యూట్యూబర్ నందు అలియాస్ నందనకు (Nandu's World) ఊహించని షాక్ తగిలింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. లండన్ లో ఉద్యోగాలు, వీసా స్పాన్సర్ షిప్ ల పేరుతో కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో నందును శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ. కోట్లలో స్కామ్..
లండన్ వెళ్లాలనుకునే నిరుద్యోగులు, వీసా పొడిగింపు కోసం చూస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని నందన, ఆమె భర్త జగర్లమూడి మధుకర్ భారీ స్కామ్‌కు తెరలేపినట్లు ఆరోపణలు ఉన్నాయి. 'డెస్టినీ కన్సల్టెన్సీ' పేరుతో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో ఆఫీసులు నడుపుతూ ఒక్కొక్కరి నుంచి రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. ఫేక్ స్పాన్సర్‌షిప్ లెటర్లు (CoS) ఇచ్చి మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కూడా కేసులు నమోదయ్యాయి.
ALSO READ : మాతృత్వ సమయంలో ఆధ్యాత్మిక పయనం..
లుకౌట్ నోటీసులతో సీన్ రివర్స్..
బాధితుల ఫిర్యాదులతో పోలీసులు ఈ దంపతులపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. లండన్‌లో సెటిల్ అయిన నందన.. ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టగానే ఎయిర్‌పోర్ట్ అధికారులు గుర్తించి ఇమిగ్రేషన్ వద్దే నిలిపివేశారు. ఆమెను శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీసాల స్కామ్ పై విచారించనున్నారు. ఆ తర్వాత ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించే అవకాశం ఉంది. నందన ఈ మధ్యే విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో నటించి వెండితెరపై కూడా మెరిసింది.
