బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధును తక్షణమే బర్తరఫ్ చేయాలి: బీజేపీ డిమాండ్

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధును తక్షణమే బర్తరఫ్ చేయాలి: బీజేపీ డిమాండ్

హైదరాబాద్: స్పీకర్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. తాతా మధు వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్ పార్టీ ముక్తకంఠంతో ఖండించగా.. బీజేపీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఈ ఇష్యూపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి శాసన సభలో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన స్థానంలో ఉన్న స్పీకర్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నదని చెప్పారు. తాతా మధును శాసన మండలి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని ఆయన అభివర్ణించారు.

అసలేం జరిగిందంటే..?

సోమవారం (సెప్టెంబర్ 7)  తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఫెయిల్ అని ప్రింట్ చేసి ఉన్న బ్లాక్ టీ షర్ట్‎లతో ప్రతిపక్ష బీఆర్ఎస్ అసెంబ్లీకి వచ్చారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. బ్లాక్ టీ షర్టులతో లోపలికి అనుమతించలేదు. తమను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర ఆగ్రహానికి గురై ‘ఎవడ్రా స్పీకర్.. ఎవడ్రా మీకు అధికారం ఇచ్చింది’ అంటూ స్పీకర్‎ను ఏకవచనంతో సంబోధించాడని కాంగ్రెస్ ఆరోపించింది.

రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి కనీస మర్యాద ఇవ్వకుండా బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండటం నచ్చకే బీఆర్‌ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను శాసన సభలో సీఎం , మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని తక్షణమే డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.