అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీ దద్దరిల్లింది. ఎమ్మెల్సీ తాతా మధును డిస్మిస్ చేయాలని సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం రేవంత్ తీర్మానానికి మద్ధతు తెలిపిన కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం సభ్యులు.. తాతా మధును డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.
తాతా మధు వ్యాఖ్యలపై 2026 సెప్టెంబర్ 7న అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. సమావేశాలకు ముందు రోజు బీఆర్ఎస్ సభ్యులను ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఉసిగొల్పి పంపించారని అన్నారు.
కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదవటం కాదు.. అనర్గళంగా మాట్లాడటం కాదు.. సంస్కారం కదా ముఖ్యం.. అని అన్నారు మంత్రి జూపల్లి. 2016లో ఎస్సీ వర్గీకరణ అంశంపై నిరసనకు దిగిన అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సండ్ర లను సభనుంచి డిస్మి్స్ చేయడం జరిగింది. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారని మళ్లీ రేవంత్, సండ్రలను బహిష్కరించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అలా.. ప్రతిపక్షంలో ఉంటే ఇలా అని అన్నారు.
పెద్దల సభ సభ్యుడు.. ఏ సంస్కారం చూసి ఆయనకు సభ్యత్వం ఇచ్చారో తెలయదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో అందరూ పుట్టుకతో సమానులే.. బతుకుదెరువు కోసం వృత్తులు వచ్చి ఉండొచ్చు.. దాన్ని బేస్ చేసుకొని అవమానకరంగా మాట్లాడితే తగదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్భాషలాడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తల్లిని మాట్లాడితే బాధ ఉండదా.. లోకంలో లేని వారి గురించి మాట్లాడటం శిక్షార్హులే.. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే వంద శాతం సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందేనని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
సీరియస్ ఇష్యూను బీజేపీ డైవర్ట్ చేయడానికి చూస్తోంది: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇది అత్యంత బాధాకరమైన పరిస్థితి అని అన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ ఘటనపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న దళితులు బాధపడుతున్నారు. 22ఏ పై బీజేపీ నేతలు ఇప్పుడు డిమాండ్ చేయడం తగదని.. సీరియస్ ఇష్యూను డైవర్ట్ చేయవద్దు, డైల్యూట్ చేయవద్దని అన్నారు. ఆ విషయాన్ని ప్రస్తుతం వాయిదా వేసుకోవాలని.. లేదంటే బీజేపీ, బీజేఎల్పీ ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూస్తుందని భావించాల్సి వస్తుందన్నారు.
స్పీకర్ కు జరిగిన అవమానంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. శాసన సభ సభాపతికే గౌరవం లేకపోతే, రక్షణ లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. స్పీకర్ కు అండగా ఉండేందుకు సభ మొత్తం ముక్త కంఠంతో నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చొక్కాలు విప్పేసే పోలీసుల మీదికి, రౌడీలు, గూండాల మాదిరిగా వెళ్లటం పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నానని.. బడుగు బలహీన వర్గాలపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. సీఎం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మద్ధతు ఇస్తున్నామని.. ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు.
దళితుడు స్పీకర్ గా ఉంటే తట్టుకోలేక పోతున్నరు: ఎమ్మెల్యే వంశీకృష్ణ
స్పీకర్ పై ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. రాకెట్ యుగంలో ఇలాంటి వివక్ష కొనసాగటం అత్యంత బాధాకరమని అన్నారు. రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ దళితుడు, తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రవేశ పెట్టింది అప్పటి స్పీకర్ మీరాకుమార్ దళితురాలు, ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే దళితులేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
స్పీకర్ పై ఇలాంటి వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. తాతా మధుతో పాటు కౌశిక్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి ముఖ్య కారణం కేసీఆర్ అని అన్నారు. సభకు వస్తే దళిత స్పీకర్ ను అధ్యక్షా అనాల్సి వస్తుందని.. అందుకే కేసీఆర్ అసెంబ్లీకి రావటం లేదన్నారు. సీఎం రేవంత్ ను చూస్తే కేసీఆర్ కు భయం వేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.
తాతా మధుతో మాట్లాడించిన వాళ్లు ఎవరో తేలాలని అన్నారు ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే వేముల వీరేశం. స్పీకర్ ను అవమానించడం లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మాట్లాడించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
