ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల పీజీ హాస్టల్ బిల్డింగ్ ఓనర్ అరెస్ట్

ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల పీజీ హాస్టల్ బిల్డింగ్ ఓనర్ అరెస్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో ఐదంతస్తుల పీజీ హాస్టల్ బిల్డింగ్ కుప్పకూలి ఏడుగురు మరణించిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హాస్టల్ బిల్డింగ్ ఓనర్‎ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న బిల్డింగ్ యాజమాని హరిరామ్ గుప్తాను సోమవారం (సెప్టెంబర్ 7) రాజస్థాన్‎లోని భివాడీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా హరిరామ్‎ను విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఆదివారం (సెప్టెంబర్ 6) మధ్యాహ్నం దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్‌ ప్రాంతంలో ఐదంతస్తుల బాయ్స్ పీజీ హాస్టల్ బిల్డింగ్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించగా.. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన తర్వాత పరారీలో ఉన్న హస్టల్ బిల్డింగ్ ఓనర్‎పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు రంగంలోకి దించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‎లోని భీవాడి ప్రాంతంలో సోమవారం (సెప్టెంబర్ 7) బిల్డింగ్ ఓనర్ హరిరామ్‎ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఢిల్లీకి తరలించి విచారిస్తున్నారు.