- గతంలో మాదిరిగా నిర్వహిస్తం
- నగరంలోని కమిషనర్లను ఆదేశిస్తా
- ఎక్స్ వేదికగా డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌జెండర్ల పేరుతో భిక్షాటన, వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలను కట్టడి చేస్తామని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హిజ్రాలపై ఈమధ్య ఫిర్యాదులు పెరుగుతున్నట్టుగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిందన్నారు.
గతంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ తరహాలోనే మరోసారి డ్రైవ్ చేపట్టి హిజ్రాల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని పోలీస్ శాఖ నిర్ణయించిందని డీజీపీ ఆదివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఈ మధ్యకాలంలో ట్రాన్స్‌జెండర్లపై ఫిర్యాదులు ఎక్కువగా చూస్తున్నాను. నిజానికి, హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు.. ట్రాన్స్‌జెండర్ల భిక్షాటన దందాలు, దోపిడీల బెడదను అరికట్టేందుకు మేము ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాము. అదేరీతిలో మరోసారి డ్రైవ్ చేపట్టాలని నేను సీపీలందరినీ ఆదేశిస్తాను.
ట్రాన్స్‌జెండర్లను సాధారణ జీవనంలోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా, హైడ్రాలో నియమించింది’ అని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్‌లో నకిలీ హిజ్రాల మాఫియాపై తగిన చర్యలు తీసుకోవాలని ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు డీజీపీ సీవీ ఆనంద్ పై విధంగా స్పందించారు.
