కారును రెండో ఫ్లోర్ ఎక్కించిన ఓనర్.. విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

కారును రెండో ఫ్లోర్ ఎక్కించిన ఓనర్.. విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే!

కారును సెకండ్ ఫ్లోర్ కు ఎక్కించిన ఘటన వైరల్ గా మారింది. అది కూడా పెద్ద క్రేన్ తెప్పించి.. నేరుగా రెండో అంతస్తుపై దించారు మహీంద్రా స్కార్పియో కారును. అన్ని డబ్బులు పెట్టి కారును పైకెక్కించడమేంటని చర్చ జరుగుతోంది. బీహార్ లో జరిగిన ఈ ఘటనకు  సంబంధించిన వీడియో ఎస్ఎంలో సర్క్యులేట్ అవుతోంది. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. 

వివరాల్లోకి వెళ్తే.. బీహార్ లోని గోపాల్ గంజ్ లో ఈ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. మనోజ్ యాదవ్ అనే వ్యక్తి.. తన మహీంద్ర స్కార్పియో క్లాసిక్ SUV కారు దొంగల పాలు కాకుండా మేడపైకి ఎక్కించాడు.

యాదవ్ ఇజ్రాయెల్ లో పనిచేస్తుంటాడు. ఆయన విదేశాల్లో ఉన్నన్ని నాళ్లు కారు బాధ్యత డ్రైవర్ కే అప్పజెప్పి వెళ్తుంటాడు. అయితే ఇటీవల డ్రైవర్ ఉద్యోగాన్నుంచి తప్పుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు ఓనర్. కారును దొంగల నుంచి కాపాడుకునేందుకు.. ఆయన వచ్చే వరకు కారును రెండో ఫ్లోర్ ఎక్కించాడు. 

క్రేన్ సహాయంతో కారును పైకి ఎక్కించడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ బిల్డింగ్ రూఫ్ ఎంత బరువు మోస్తుంది.. కారును పైన ఉంచడం సేఫేనా అనే కోణంలో చర్చ జరుగుతోంది. 

బీహార్ లో దొంగతనాలు ఎక్కువ జరుగుతుంటాయి అంటుంటారు.. పర్సులు, సెల్ ఫోన్ లు, గోల్డ్ చైన్లు కాదు.. ఏకంగా టవర్లను కూడా ఎత్తుకెళ్తుంటారని అంటుంటారు. ఆ మధ్య అలాంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అంతలా ఉంటుంది అక్కడ దొంగల భయం. అందుకే  కావచ్చు..ఈ ఓనర్ ఏకంగా కార్ ను మిద్దెపైకి ఎక్కించాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.