చెన్నై: మహిళలపై జరుగుతున్న వ్యక్తిగత దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలపై సీఎం విజయ్ సీరియస్ అయ్యారు. మహిళలపై వ్యక్తిగత విమర్శలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. మహిళలను రాజకీయాల్లోకి లాగొద్దని వార్నింగ్ ఇచ్చారు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడే వారిపై చట్టపరంగా కఠినమైన తీసుకుంటామని హెచ్చరించారు.
ఇటీవల డీఎంకే యువనేత, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిష రిలేషన్‌పై డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో సెటైర్లు వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై సీఎం విజయ్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. ఎంతటివారైనా చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
పరిమితులకు లోబడి ఉన్నంత వరకు రాజకీయ విమర్శలు సహజమే. కానీ మహిళలపై పరువు తీసే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయొద్దని సూచించారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పారు. సమాజంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. మన తల్లి, సోదరీమణులు, కుమార్తెలను గౌరవించినట్లే సమాజంలోనూ ప్రతి ఒక్కరూ మహిళను గౌరవించాలని సూచించారు.
1989లో డీఎంకే ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో దివంగత మాజీ సీఎం జయలలితకు జరిగిన అవమానాన్ని ప్రస్తావిస్తూ.. అలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకూడదని అన్నారు. ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. మహిళల జోలికొస్తే తాను చూస్తూ ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.
