విదేశాల్లో చదువుకుని.. ఇండియాలో స్థిరపడాలని భావించే యువతకు యాక్సిస్ బ్యాంక్ ఒక సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. విదేశీ యూనివర్సిటీల్లో విద్యనభ్యసించి.. రెండేళ్లు గ్లోబల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రతిభావంతుల కోసం 'అరైజ్ హోమ్‌కమింగ్' పేరుతో ఒక ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కి శ్రీకారం చుట్టింది. విదేశీ గడ్డపై ఉన్న టాలెంటెడ్ ఇండియన్ యూత్‌ను మళ్లీ మన దేశానికి రప్పించి.. ఇక్కడే అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందించడమే ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం.
నేటి ఆధునిక కాలంలో యువత కేవలం ఉద్యోగం చేయడమే కాకుండా, తాము చేసే పని ద్వారా సమాజంలో ఒక మంచి ప్రభావాన్ని చూపాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎడ్యుకేషన్ పొందిన వారికి యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్నతమైన కెరీర్ బాటలు వేస్తున్నామని ఆ బ్యాంక్ హెచ్‌ఆర్ గ్రూప్ హెడ్ రాజ్‌కమల్ వేంపటి తెలిపారు. కేవలం ఒకే రకమైన డిగ్రీలకు పరిమితం కాకుండా.. వివిధ విభాగాల్లో నైపుణ్యాలు ఉన్న ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.
2025 నాటికి సుమారు 12 లక్షల 50వేల మంది భారతీయ విద్యార్థులు విదేశీ ఉన్నత విద్యా సంస్థల్లో అభ్యసించారని డేటా చెబుతోంది. ఈ భారీ గ్లోబల్ టాలెంట్ పూల్‌ను సద్వినియోగం చేసుకోవాలని యాక్సిస్ బ్యాంక్ భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఎంపికైన అభ్యర్థులు బ్యాంకింగ్ రంగంలోని టెక్నాలజీ, డిజిటల్, బిజినెస్, స్ట్రాటజీ, వెల్త్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ వంటి వివిధ కీలక విభాగాల్లో తమ సత్తా చాటేందుకు అవకాశం లభిస్తుంది.
విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకుని భారత్ తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు ఇది చక్కటి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ ఇనిషియేటివ్ ద్వారా గ్లోబల్ అనుభవం ఉన్న యువతకు మన దేశంలోనే అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభించడమే కాకుండా.. బ్యాంకింగ్ రంగంలో కొత్త ఆలోచనలకు పెద్దపీట వేసినట్లు అవుతుంది. విదేశీ విద్యతో వస్తున్న నూతన దృక్పథం భారతీయ కార్పొరేట్ రంగానికి మరింత ఊతమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
