అసెంబ్లీలో భావోద్వేగ వాతావరణం.. సభలో స్పీకర్, మంత్రి సీతక్క కంటతడి

అసెంబ్లీలో భావోద్వేగ వాతావరణం.. సభలో స్పీకర్, మంత్రి సీతక్క కంటతడి

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలి రోజే శాసన సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతామధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాట్లాడుతూ మంత్రి సీతక్క తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. సీతక్క భావోద్వేగానికి గురి కావడం చూసి చైర్ లో ఉన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ ఘటనతో అసెంబ్లీలో నిశబ్ధ వాతావరణం నెలకొంది. సీఎం, మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు స్పీకర్‎కు సంఘీభావం ప్రకటించారు.

అసలేం జరిగిందంటే..?

సోమవారం (సెప్టెంబర్ 7)  తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఫెయిల్ అని ప్రింట్ చేసి ఉన్న బ్లాక్ టీ షర్ట్‎లతో ప్రతిపక్ష బీఆర్ఎస్ అసెంబ్లీకి వచ్చారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. బ్లాక్ టీ షర్టులతో లోపలికి అనుమతించలేదు. తమను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర ఆగ్రహానికి గురై స్పీకర్‎ను అసభ్య పదజాలంతో దూషించాడు.

రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి కనీస మర్యాద ఇవ్వకుండా బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనపై అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. స్పీకర్‎ను ఆయన తల్లిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య పదజాలంతో దూషించి అవమానించాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయమని బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఆ పార్టీ నాయకులను ఉసిగొల్పాడని ఆరోపించారు. 

దళిత స్పీకర్‎ను అవమానించడం వెనక కేసీఆర్ ఉన్నారన్నారు. బీఆర్ఎస్ నాయకత్వానికి మొదటి నుంచి కూడా దళితులు అంటే పడదని అన్నారు. దళితుడు స్పీకర్ చైర్‎లో కుర్చొవడంతో అతడిని అధ్యక్షా అనాల్సి వస్తుందనే కేసీఆర్ సభకు రావట్లేదని ఆరోపించారు. బ్యాడ్ ల్యాంగ్వేజీకి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అండ్ కో అని విమర్శించారు. స్పీకర్‎పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

ALSO READ : బ్యాడ్ లాంగ్వేజీకి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్లు

తాతా మధు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. స్పీకర్‎పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు.. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన నవీన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్‎పై ఎమ్మెల్సీ తాతా మధు అసభ్య వ్యాఖ్యలపై మాట్లాడుతూ సీతక్క అసెంబ్లీలో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. సీతక్క ఏడవటంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా కంటతడి పెట్టుకున్నారు. 

దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండటం నచ్చకే బీఆర్‌ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను శాసన సభలో సీఎం , మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని తక్షణమే డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.