న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌లోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని ఒక పార్లమెంట్ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (సెప్టెంబర్ 7) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఆరు స్థానాల్లో 2026, అక్టోబర్ 6న బై ఎలక్షన్స్ జరగనుండగా.. అక్టోబర్ 9న కౌంటింగ్, ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఈసీ ప్రకటించింది.
వివిధ కారణాలతో సభ్యులు రాజీనామాలు చేయడంతో ఈ స్థానాల్లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అస్సాంలోని నగావ్ పార్లమెంట్, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజీగ్రామ్, పుదుచ్చేరిలోని తట్టంచావడి, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
అయితే, తమిళనాడులో సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్‌తో పాటు విరాలిమలై, పెరందురై, అంబసముద్రం, కరూర్ నియోజకవర్గాలకు కూడా బై ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. ఈ స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, ఈ స్థానాలకు సంబంధించి గత ఎన్నికల ఫలితాలపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
ప్రస్తుతం ఈ పిటిషన్లపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్లపై విచారణ పూర్తై తీర్పు వెలువరించే వరకు ఉప ఎన్నికలు నిర్వహించబోమని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించడం లేదు.
ఉప ఎన్నికల పూర్తి షెడ్యూల్
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 9 సెప్టెంబర్
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 16
- నామినేషన్ పత్రాల పరిశీలన: సెప్టెంబర్ 17
- నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ: సెప్టెంబర్ 19
- ఎన్నికల తేదీ: 6 అక్టోబర్
- లెక్కింపు తేదీ: అక్టోబర్ 9
