గాల్లో ఉండగానే ఇంజిన్‎ ఫెయిల్.. ఫ్లైట్ లోపల 185 మంది.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా

గాల్లో ఉండగానే ఇంజిన్‎ ఫెయిల్.. ఫ్లైట్ లోపల 185 మంది.. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా

చెన్నై: మలేషియా ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. గాల్లో ఉండగానే ఇంజిన్‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను వెంటనే పసిగట్టిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి చెన్నై ఎయిర్ పోర్టులో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. విమానం మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి చెన్నై వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ  సమయంలో విమానంలో 185 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకోకపోవడంతో ప్రయాణికులు, అధికారులు, విమాన సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

అధికారుల వివరాల ప్రకారం.. మలేషియా ఎయిర్‌లైన్స్‎కు చెందిన MH156 విమానం సోమవారం (సెప్టెంబర్ 7) 185 మంది ప్రయాణికులతో కౌలాలంపూర్ నుంచి చెన్నై బయలుదేరింది. అయితే, గాల్లో ప్రయాణిస్తుండగానే మార్గమధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫ్లైట్ రెండవ ఇంజన్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ తలెత్తినట్లు పైలట్ గుర్తించాడు. 

వెంటనే అప్రమత్తమైన పైలట్ ఈ సమాచారాన్ని చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‎కు చేరవేసి ఎమర్జె్న్సీ ల్యాండింగ్‎కు అనుమతి కోరాడు. విమానానికి అత్యవసరం ల్యాండింగ్ అనుమతి ఇచ్చిన ఏటీసీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ప్రకటించింది. ఏటీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానాన్ని చెన్నై ఎయిర్ పోర్టులో పైలట్ అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. 

విమానం రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను కిందకు దించారు. పైలట్ అప్రమత్తతతో విమానంలో ఉన్న 186 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం విమానాన్ని ప్రత్యేకు బేకు తరలించారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యపై ఏవియేషన్ అధికారులు, టెక్నికల్ టీమ్ దర్యాప్తు చేపట్టారు.